
మెగాస్టార్ చిత్రంలో పవర్ స్టార్ స్వరం వినిపిస్తే... ఆ స్వరం చిత్ర కథలోకి మనల్ని నడిపిస్తే... ఇక అభిమాన గణం ఆనందానికి అవధులు ఏముంటాయి. ఆ స్థాయి ఆనందం త్వరలోనే అభిమానులకు అందబోతోంది. మరి అలాంటి అరుదైన సంఘటన ఈ సారి సైరా చిత్రంలో జరగబోతుంది.
మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ చిత్రానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు వాయిస్ ఓవర్ అందించారు. ‘సైరా’ టీజర్ కి కొద్ది రోజులనాడే శ్రీ పవన్ కల్యాణ్ గారు వాయిస్ ఓవర్ చెప్పారు. తమ్ముడు తన చిత్రానికి భావోద్వేగంతో స్వరం వినిపిస్తుంటే అన్నయ్య శ్రీ చిరంజీవి గారు పక్కనే ఉన్నారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి వెండి తెర రూపం ఈ చిత్రం. ఈ చారిత్రక వీరుడి ఘనతను పరిచయం చేసే వాక్యాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గళం నుంచి వినబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
అన్నయ్య, తమ్ముడు కలిసి వెండి తెరపై కొద్ది క్షణాలపాటు కనిపించిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. చిత్రాన్ని ప్రేక్షకులు మరచిపోలేదు. ఇప్పుడు అన్నయ్య నటించిన 151వ చిత్రానికి తమ్ముడు పవన్ కల్యాణ్ గారు వాయిస్ ఓవర్ చెప్పడం ప్రేక్షక లోకాన్ని కథలోకి తీసుకువెళ్తుంది. ఇక మరి ఈ చిత్రానికి ఎంత మంచి హిట్ వస్తుందో వేచి చూడాలి. ఇకపోతే సినీ ప్రేక్షకుల్లో పవన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కొన్ని చిత్రాలు ఒక హీరో క్రేజ్‌ని మరొకరు వాడుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ విషయానికి వస్తే మహేష్‌బాబు కూడా చాలా చిత్రాలకి ఫ్లాష్‌బ్యాక్‌కు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలాగే నేచరల్‌స్టార్ నాని. ఇంకా జగపతిబాబు, నాగార్జున ఇలా చాలా మంది హీరోలు వారి వాయిస్‌ని వినిపిస్తూనే ఉన్నారు. ఇక మరి ఈ సారి ఈ అన్నదమ్ముల ప్రయతన్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచిచూడాలి. ఇద్దరూ కలిసి కాసేపు తెరమీద కనిపించినా, అన్నయ్య సినిమాలో తమ్ముడి స్వరం విన్నా మెగా ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి.