తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి సినిమాల్లో టైటిల్‌ చూడగానే అలనాటి 'మాయాబజార్‌' గుర్తొచ్చింది కదా! కృష్ణుడిగా ఎన్టీఆర్‌, అభిమన్యుడిగా ఏయన్నార్‌, శశిరేఖగా సావిత్రి నటించి మెప్పించారు.

ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్‌ నటన అమోఘం. మరి ఇప్పుడు 'మాయాబజార్‌' రీమేక్‌లో రానా, నాగచైతన్య నటిస్తున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదండీ..! నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారంతే.

థియేటర్లకు దీటుగా ఓటీటీ వేదికలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో కళకళలాడుతున్నాయి. అదే ఉత్సాహంతోనే 'మాయాబజార్‌' వెబ్‌సిరీస్‌ను రానా , నాగచైతన్య రూపొందిస్తున్నారు. గౌతమి చల్లగుళ్ల అనే మహిళా దర్శకురాలు దీన్ని తెరకెక్కిస్తారట. నరేశ్‌ విజయకృష్ణ, ఝాన్సీ, ఇషారెబ్బ, అదితి, రవి వర్మ, హరితేజ, నవదీప్‌, రాజా చెంబోలు, సునయన, హారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్‌ యాదవ్‌ సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు జెర్రీ సిల్వస్టర్‌ సంగీత దర్శకుడు. 'మాయాబజార్‌' పేరుతో వెబ్‌సిరీస్‌ తెరకెక్కిస్తున్న గతేడాది సెప్టెంబరులోనే ప్రకటించారు. అయితే, ఇప్పటివరకూ దానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. యువ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు రానా 'స్పిరిట్‌ మీడియా' నిర్మాణ సంస్థ ద్వారా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా కథ నచ్చడంతో నాగచైతన్య కూడా ఇందులో భాగస్వామి అయ్యారు. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రానా అనారోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగినట్లు చెప్పారు. 'చాలా మంది అనారోగ్యం పాలై కోలుకున్న తర్వాత కూడా ధైర్యంగా ఉండలేరు. ఏదో తెలియని బాధ ఉంటుంది. నాకు కార్నియల్‌ (కంటికి సంబంధించిన సమస్య) ట్రాన్స్‌ప్లాంట్‌ జరిగింది. అలాగే కిడ్నీ కూడా. నేను దాదాపు టెర్మినేటర్‌నే (నవ్వులు). నేను ఇంకా బతికే ఉన్నాను. కాలంతో మనం వెళ్తూ ఉండటమే' అని చెప్పుకొచ్చారు. ఇక బాబాయ్‌ వెంకటేశ్‌తో కలిసి ఆయన నటించిన వెబ్‌సిరీస్‌ 'రానా నాయుడు' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే.

ఐతే రానా నాయుడు సిరీస్ కి మాత్రం ప్రేక్షకులకు నుండి విమర్శలు ఎదురవుతున్నాయి.ఇది మాత్రం అలా ఉండకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: