ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా మొదలైంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న మొదటి సినిమా ఇది. 'AA22xA6' అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముంబైలో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముంబైలో చకచకా జరుగుతోంది. కేవలం ఇండియాలోనే కాదు, సినిమాలోని చాలా భాగం విదేశాల్లో కూడా షూట్ చేయనున్నారు. ముఖ్యంగా, ఈ సినిమా గ్రాండ్ విజువల్స్, క్వాలిటీ కోసం హాలీవుడ్ నుంచి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. CGI, VFX, మేకప్ వంటి విభాగాల్లో వాళ్లు ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. దీన్ని బట్టే ప్రాజెక్ట్ ఎంత పెద్దదో, ఎంత గ్రాండ్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో ఓ క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఇండస్ట్రీ బజ్ ప్రకారం, బాలీవుడ్ నటి అనన్య పాండేను ఈ సినిమాకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, వారిలో అనన్య ఒకరని అంటున్నారు. గతంలో జాన్వీ కపూర్, సమంత రుత్ ప్రభు వంటి తారల పేర్లు కూడా ఈ భారీ బడ్జెట్ చిత్రంలో వినిపించాయి. అయితే, అల్లు అర్జున్ పక్కన మెయిన్ హీరోయిన్‌గా అనన్యనే కనిపించబోతోందని వార్తలు బలంగా వస్తున్నాయి.

అనన్య పాండేకి గత కొంతకాలంగా మంచి సినిమాలు, సిరీస్‌లు దక్కుతున్నాయి. ఇటీవల 'CTRL', 'కేసరి చాప్టర్ 2' వంటి చిత్రాలు, 'కాల్ మీ బే' అనే వెబ్ సిరీస్‌తో ఆమె మెప్పించింది. ఇప్పుడు 'చంద్ మేరా దిల్' అనే మరో సినిమా కూడా చేస్తోంది. అయితే, విజయ్ దేవరకొండతో కలిసి తను సౌత్‌లో చేసిన మొదటి సినిమా 'లైగర్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, ఇప్పుడు ఐకాన్ స్టార్ పక్కన మరో ఛాన్స్ దక్కించుకొని సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అనన్య.

సినిమా అనౌన్స్‌మెంట్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న సన్ పిక్చర్స్ విడుదల చేసిన ఒక ఎగ్జయిటింగ్ వీడియోతో వచ్చింది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ కూడా తన 'పుష్ప' స్టైల్‌ని పూర్తిగా వదిలిపెట్టి, తన లుక్‌ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

'AA22xA6' తర్వాత అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మళ్ళీ పనిచేయనున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కావడం విశేషం. ఈ సినిమా కుమారస్వామి అవతారం ఆధారంగా ఒక కొత్త తరహా కథతో, చాలా యూనిక్‌గా ఉంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: