ఒకసారి అభిమానులు చేసే అతి హీరోల ఆగ్రహానికి కారణం అవుతుంటుంది. అటువంటి పరిస్థితే తమిళ కమెడియన్ క‌మ్‌ హీరో సూరికి తాజాగా ఎదురైంది. ఒకప్పుడు రూ. 20 జీతానికి రోజూ కూలీగా పనిచేసిన సూరి.. ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరో స్థాయికి ఎదిగారు. ఇప్పుడున్న స్టార్డ‌మ్‌ అంత సులభంగా వచ్చింది కాదు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన సూరి.. దాదాపు ఆరేళ్ల పాటు గుర్తింపు లేని పాత్రలు చేశారు. 18 ఏళ్ల పాటు కమెడియన్ గా సినిమాల్లో న‌టించారు. `విడుదల పార్ట్ 1` మూవీ తో సూరి హీరోగా టర్న్ అయ్యారు. ఈ సినిమాతోనే నటుడిగా ఆయనలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయం అయింది.


అప్పటినుంచి ఆయన కమెడియన్ గానే కాకుండా హీరోగానూ సత్తా చాటుతున్నారు. సూరి కథానాయకుడుగా వచ్చిన తాజా చిత్రం `మామన్`. ఐశ్వర్య లక్ష్మి ఇందులో హీరోయిన్ గా నటించింది. మే 16న తమిళనాట విడుద‌లైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌బడుతుంది. అయితే మామ‌న్‌ సినిమా పెద్ద హిట్ కావాలంటూ కొందరు సూరి అభిమానులు తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో ప్ర‌త్యేక‌ పూజలు, అర్చనలు చేయించారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు.


అక్కడితో ఆగకుండా సినిమా కటౌట్లు పెట్టి పాలుతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతర భక్తులకు ఇబ్బందులు కలిగించారు. పైగా కొందరు ఫ్యాన్స్ మొక్కకుని నేలపైనే భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సూరి దృష్టికి రావడంతో.. ఆయన తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ఛీ.. ఇలాంటి ప‌నికిమాలిన ప‌నులు చేసి పరువు తీయొద్దు అంటూ అభిమానుల‌ను హెచ్చరించారు.


నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. క‌థ‌, క‌థ‌నం బాగుంటే సినిమా త‌ప్ప‌క‌ ఆడుతుంది.. అది తెలిసి కూడా రిలీజ్ స‌మ‌యంలో డ‌బ్బును ఈ విధంగా వృధా చేయడం త‌నను ఆవేదన కలిగించిందని సూరి అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టి కడుపు నింపితే తాను ఆనందించేవాడ్ని.. అంతే తప్ప ఇటువంటి చెత్త పనులు చేసి నా అభిమానులని చెప్పుకునే అర్హత మీకు లేదు అంటూ సూరి వ‌ర్నింగ్ ఇచ్చారు. సూరి వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్లు కూడా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: