
ఎటువంటి అంచనాలు లేకుండా మే1న విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రజనీకాంత్, శివకార్తికేయన్ వంటి తమిళ స్టార్ హీరోలు కూడా టూరిస్ట్ ఫ్యామిలీకి ఫిదా అయ్యారు. చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. రూ. 5 కోట్లతో నిర్మితమైన టూరిస్ట్ ఫ్యామిలీ.. ఇప్పటికే రూ. 70 కోట్ల రేంజ్‌లో వసూళ్లను రాబట్టి 2025లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఏడవ తమిళ చిత్రంగా నిలిచింది.
తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీని వీక్షించి ఎక్స్ వేదికగా రివ్యూ ఇచ్చారు. `టూరిస్ట్ ఫ్యామిలీ చూశాను. ఇదొక అద్భుతమైన సినిమా. హృదయాన్ని కదిలించే మరియు చక్కిలిగింతలు పెట్టే హాస్యంతో నిండి ఉంది. ప్రారంభం నుండి చివరి వరకు నన్ను ఎంతో ఆసక్తిగా ఉంచింది. అభిషన్ జీవిత్త్ తన గొప్ప రచన మరియు దర్శకత్వంతో ఆకట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో అత్యుత్తమ సినిమా అనుభవాన్ని అందించినందుకు ధన్యవాదాలు. అందరూ మిస్ అవ్వకుండా చూడండి.` అంటూ రాజమౌళి స్వయంగా ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టడంతో.. టూరిస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. రాజమౌళి మెచ్చిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవ్వాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు.