
2017లో తమిళ చిత్రం `విజితిరు` ప్రమోషనల్ ఈవెంట్ లో టీ. రాజేందర్, ధన్షిక మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రెస్ మీట్‌లో సాయి ధన్షిక తన ప్రసంగంలో టీ. రాజేందర్ పేరును ప్రస్తావించడం మరచిపోవడంతో.. ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. అదే స్టేజ్‌పై మాట్లడుతూ ధన్షికపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో `కబాలి` చిత్రంలో రజినీకాంత్ కూతురిగా ధన్షిక యాక్ట్ చేస్తోంది.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టీ. రాజేందర్ సాయి ధన్షికను దారుణంగా తిట్టారు. `ఒక్క హిట్టొస్తే చాలు సీనియర్లను మర్చిపోతారు. అంతెందుకు కబాలిలో రాజనీకాంత్ తో కలిసి నటించగానే ధన్షికకు కూడా పొగరు పెరిగిపోయింది. కనీసం నా పేరు కూడా ఆమె చెప్పలేదు` అంటూ రాజేందర్ హీరోయిన్ ను అందరి ముందు దుయ్యబట్టారు. వెంటనే ధన్షిక మైక్ అందుకుని ఆయన సారీ చెప్పినా.. క్షమించమని కాళ్లకు నమస్కరించినా.. టీ.రాజేందర్ ఆగ్రహం మాత్రం చల్లారలేదు.
పైగా `సారీ ధరించకుండా వచ్చి, ఇప్పుడు సారీ అంటున్నారు` అంటూ మరింత అసభ్యంగా ధన్షికను రాజేందర్ విమర్శించారు. దాంతో ఆమె అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో ఈ ఇష్యూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ.. టీ. రాజేందర్ కు చురకలు వేశారు. పొరపాటున పేరు మర్చిపోయినందుకు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని ఆయనకు హితవు పలికారు. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్ కూడా అప్పట్లో రాజేందర్ ప్రవర్తనను ఖండించారు.