తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ట్రెండ్ ను ఫాలో అయ్యే దర్శకులు కొందరైతే.. ట్రెండ్ ను సెట్ చేసే దర్శకులు మ‌రికొందరు. ఆ రెండో కోవ‌కు చెందిన వారే శేఖర్ కమ్ముల. తాజాగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ స్పెష‌ల్ అకేష‌న్ ను శేఖ‌ర్ క‌మ్ముల మెగాస్టార్ చిరంజీవితో సెల‌బ్రేట్ చేసుకున్నారు. 2000 సంవత్సరంలో `డాలర్ డ్రీమ్స్` మూవీతో డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్‌గా, రైటర్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు శేఖర్‌ కమ్ముల.


ఆ త‌ర్వాత‌ `ఆనంద్`, `గోదావరి`, `హ్యాపీడేస్`, `ఆవకాయ్ బిర్యానీ`, `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్`, `ఫిదా`, `లవ్ స్టోరీ` వంటి ఫీల్ గుడ్ చిత్రాలే కాకుండా `లీడర్` వంటి పొలిటికల్ డ్రామా, `అనామిక` వంటి మిస్టరీ థ్రిల్ల‌ర్ తోనూ ప్రేక్షకులను మెప్పించారు. యూనిక్ థాట్స్, ఆకట్టుకునే ఫిల్మ్‌ మేకింగ్ మరియు త‌న పెన్‌ పవర్ తో స్టార్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం డబ్బు, వ్యవస్థ, అవినీతి చుట్టూ తిరిగే క‌థాంశంతో `కుబేర‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ధ‌నుష్, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 20న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.


ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సినిమాల్లోకి రాక‌ముందు శేఖ‌ర్ క‌మ్ముల ఏం ప‌ని చేసేవారో తెలిస్తే క‌చ్చితంగా ఆశ్చ‌ర్య‌పోతారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. హైద‌రాబాద్ లో పెరిగారు. ఇంజనీరింగ్ అయ్యాక యూఎస్‌లో మాస్ట‌ర్స్ కంప్లీట్ చేశారు. ఆపై ఐటీ పరిశ్రమలో దాదాపు మూడు సంవత్సరాలు జాబ్ చేశారు. ఆ తరువాతే ఆయ‌న ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అయ్యారు. వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీని పొందారు. ఆ స‌మ‌యంలో యూఎస్ లో అనేక చిత్రాలకు పనిచేశారు. మొత్తానికి అలా ఐటీ జాబ్ వ‌దిలేసి శేఖ‌ర్ క‌మ్ముల సినీ ప‌రిశ్ర‌మ వైపు అడుగులు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: