భారతదేశం గర్వించగల బ్యాడ్మింటన్ స్టార్‌లు , ఎంతోకాలం ప్రేమించి చివరకు పెళ్లి చేసుకున్న జంట - సైనా నెహ్వాల్ మరియు పారుపల్లి కశ్యప్ ఇప్పుడు విడిపోయారు . ఈ విషాద వార్తను సైనా నెహ్వాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించగా , కశ్యప్ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. "చాలా ఆలోచించి , ఎన్నో చర్చల తర్వాత ... మేమిద్దరం కలిసుండలేమనే నిర్ణయాని కి వచ్చాం" అని సైనా తెలిపింది . ఇద్దరూ పుల్లెల్ల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ లో పరిచయమై , అదే పరిచయం ప్రేమగా మారి , 2012 తర్వాత పదేపదే కలిసి కనిపిస్తూ వచ్చారు. చివరికి 2017లో ఇద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు.
 

ఇక ఆ తర్వాత దాదాపు ఏడేళ్లు కలిసి ఉన్న ఈ జంట, ఇటీవల విడిగా జీవిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సైనా మాటలతో వాటికి తుదితీర్పు లభించింది . ఇటీవల కాలంలో సైనా ఫిట్‌నెస్ ఇష్యూలు కారణంగా టోర్నీల్లో నుంచి విరమించగా, కశ్యప్ ఆటకు గుడ్‌బై చెప్పి కోచింగ్ రంగంలోకి ప్రవేశించారు. వృత్తిపరంగా మారుతున్న మార్పులు, వ్యక్తిగత విభేదాలు, టైమ్ మేనేజ్‌మెంట్ ఇబ్బందులు వీరి మధ్య దూరం పెరగడానికి కారణమై ఉంటాయనే ఊహలు వినిపిస్తున్నాయి.తెలుగు క్రీడా రంగానికి చెందిన బ్యాడ్మింటన్ ప్రేమ జంటల్లో ఇదే మొదటిసారి కాదు. గుత్తా జ్వాలా – చేతన్ ఆనంద్ ప్రేమించి , 2005లో పెళ్లి చేసుకొని, 2011లో విడిపోయారు.

 

అయితే ఇప్పటికీ ఇద్దరూ తమ జీవితాల్లో కొత్త అడుగులు వేశారు. గుత్తా జ్వాలా ఇటీవల తమిళ నటుడు విష్ణు విశాల్‌తో వివాహం చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు సైనా – కశ్యప్ కూడా అదే దారిలో నడిచారు. ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్‌కు బలమైన జోడీగా నిలిచిన వీరి విడాకుల కథ అభిమానులను బాధలో ముంచుతుంది. ప్రేమను పెళ్లిగా మార్చుకున్నా, జీవిత ప్రయాణం మాత్రం చివరి వరకు ఒకే దారిలో నడవలేదనేది ఈ జంట కథలో తీపి చేదుల సమ్మేళనం.

మరింత సమాచారం తెలుసుకోండి: