
ఈ మధ్యకాలంలో కెరీర్ పరంగా మాధవన్ మరింత జోరు చూపిస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ తో కలిసి `ఆప్ జైసా కోయి` అనే మూవీతో పలకరించారు. చాలా కాలం తర్వాత మాధవన్ మళ్లీ ఈ మూవీలో తన రొమాంటిక్ సైడ్‌ను చూపించారు. ఈ సంగతి పక్కన పెడితే.. 55 ఏళ్ల వయసులోనూ యంగ్ గా కనిపిస్తూ కుర్ర హీరోలకు మాధవన్ గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్నించగా.. మాధవన్ తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ను రివీల్ చేశాడు. తాను సూర్యరశ్మి, కొబ్బరి నూనె, ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని.. అవే తన గ్లామర్ వెనుక దాగి ఉన్న సీక్రెట్స్ అని మాధవన్ తెలిపాడు. చాలా మంది నటులు యంగ్‌గా, అందంగా కనిపించడానికి ఫిల్లర్లు, సౌందర్య చికిత్సలపై ఆధారపడతారు.. కానీ, అదంతా ఒక రకమైన మోసమని.. వృద్ధాప్యాన్ని సహజంగా స్వీకరించాలని మాధవన్ పేర్కొన్నాడు.
తన హెయిర్ కేర్ గురించి మాట్లాడుతూ.. గత ఇరవై ఏళ్లుగా ప్రతి ఆదివారం నువ్వుల నూనెతో తలస్నానం చేస్తానని, రోజూ కొబ్బరి నూనెను వాడతానని మాధవన్ వివరించాడు. అలాగే తాను ఎటువంటి సౌందర్య చికిత్సలు, సర్జరీలు చేయించుకోలేదని, పాత్రలకు అవసరమైనప్పుడు మాత్రం ఫేషియల్స్ చేయించుకుంటానని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఇక ఫుడ్ కూడా హెల్త్ కు చాలా ముఖ్యమని.. అందుకే తాను ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకుంటానని.. షూటింగ్ కి వెళ్తే చెఫ్‌ను తీసుకెళ్లి వండించుకుని తింటానని మాధవన్ తెలిపాడు.