
హరిహర వీరమల్లు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదలైంది. ఫస్టాఫ్ అద్భుతం అని చెబుతున్న అభిమానులు సెకండాఫ్ మాత్రం ఆ స్థాయిలో లేదని కామెంట్లు చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి "హరి హర వీర మల్లు" సినిమాను మొదట డైరెక్ట్ చేశారు, కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందించారు. అయితే సినిమా నిర్మాణంలో ఆలస్యాలు, పవన్ పొలిటికల్ కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.
సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నివేశాలను క్రిష్ డైరెక్ట్ చేశారని మిగతా సన్నివేశాలను మాత్రం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే వీరమల్లు మూవీ మొత్తాన్ని క్రిష్ డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. హరిహర వీరమల్లు ఫస్టాఫ్ అయితే వేరే లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తప్పులతో సెకండాఫ్ విషయంలో పొరపాట్లు దొర్లాయి.
అనవసరమైన ల్యాగ్ తో సినిమా విషయంలో మేకర్స్ తప్పటడుగులు వేశారు. క్రిష్ దర్శకత్వ ప్రతిభ మిస్ కావడం కొన్ని సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. క్రిష్ గతంలో "గౌతమీపుత్ర శాతకర్ణి", "కంచె" వంటి చారిత్రక, సందేశాత్మక చిత్రాలను విజయవంతంగా తెరకెక్కించి విజయం సాధించారు. ఆయన శైలి, కథ చెప్పే విధానం ప్రత్యేకంగా ఉంటాయి. "హరి హర వీర మల్లు" వంటి పీరియాడిక్ డ్రామాకు క్రిష్ విజన్ పూర్తిస్థాయిలో ఉంటే సినిమాకు మరింత బలం చేకూరి ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలను తెరకెక్కించడం అందరికీ సాధ్యం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ లాంటి హీరోను సరిగ్గా వాడుకునే విషయంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సినిమా మధ్యలో దర్శకుడు మారడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వడంతో పాటు ఆ ప్రభావం సినిమా క్వాలిటీపై పడింది. హరిహర వీరమల్లు ఫలితం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.