దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దివంగ‌త‌ అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని ఆయన రెండో కుమారుడు అక్కినేని నాగార్జున విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ చాలా కాలం పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణతో పాటు, ఆ బ్యానర్‌లో నిర్మించిన అనేక సినిమాల నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించారు. నాగార్జున చిన్ననాటి నుంచే నటుడిగా మారాలని కోరుకున్నారు, ఆ కోరికను సాకారం చేసుకున్నారు. కానీ వెంకట్‌కు మాత్రం ద‌ర్శ‌కుడు కావాల‌న్న కల ఉండేది. ఈ కోరికను నెరవేర్చేందుకు ఆయన ఓ ప్రయత్నం కూడా చేశారు. రచయిత రాజసింహా తెలిపిన వివరాల ప్రకారం, అక్కినేని వెంకట్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభమైంది. దానికి మాటల రచయితగా రాజసింహానే పనిచేశారు. దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేసిన రాజసింహా, ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాకి దర్శకత్వం వహించారు.


అప్పట్లో అక్కినేని కుటుంబం, జగపతి బాబు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల, వెంకట్ తన తొలి సినిమాకి జగపతి బాబునే హీరోగా ఎంపిక చేశారు. ఆ సినిమాకు ‘నేను పుట్టాను’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో కాకుండా, జెమినీ కిరణ్ నిర్మించాలనుకున్నారు. పూర్తి వినోదభరితమైన ఫన్ రైడ్ స్క్రిప్ట్‌ను ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పూర్తికాకముందే ఆగిపోయింది. ఒకవేళ ‘నేను పుట్టాను’ పూర్తిై విడుదలై, విజయాన్ని సాధించి ఉంటే, అక్కినేని వెంకట్ ఈ రోజుకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రామిసింగ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందేవారేమో..!


సినిమా ఆగిపోవడంతో వెంకట్ మళ్లీ నిర్మాణ, స్టూడియో నిర్వహణ పనులపై దృష్టి సారించారు. దర్శకుడిగా మారాలన్న కల మాత్రం సగం దారిలోనే ఆగిపోయింది. ఆ త‌ర్వాత ఆయ‌న సినిమా రంగానికి పూర్తిగా దూర‌మై వైజాగ్‌లో వ్యాపారాల్లో బిజీ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: