‘మాస్ జాతర’ వాయిదా వార్తలు టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఫిలిం నగర్ వర్గాల ప్రచారం కారణంగా ఈ వార్తను ఫ్యాన్స్ నిజంగానే కన్ఫర్మ్ చేసుకున్నారు. చేతిలో ఉన్న పది రోజుల్లోనే సెన్సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, ప్రమోషన్లు వంటి కీలక పనులు పూర్త‌వ్వ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది నిర్మాత నాగవంశీ. ఇటీవలే ‘వార్ 2’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయనకు పెద్దగా ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. దీంతో వంశీపై ఫైనాన్షియల్ ఒత్తిళ్లు కూడా ఉన్నాయంటున్నారు. వంశీ నిర్మించిన కింగ్‌డ‌మ్ కూడా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇప్పుడు మాస్ జాత‌ర సినిమా కూడా వంశీ నిర్మించ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు నుంచి వంశీపై త‌మ బ్యాలెన్స్ అమౌంట్లు క్లీయ‌ర్ చేయాల‌ని ఒత్తిడి ఉంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


ఇక ఇటు హీరో రవితేజ కెరీర్ గత అయిదేళ్లుగా పెద్ద ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఆయన నుంచి వచ్చిన సాలిడ్ బ్లాక్‌బస్టర్లు ‘క్రాక్’, ‘ధమాకా’ మాత్రమే. మిగతా సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చాయి. ‘ఈగల్’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ లాంటి ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలు ఇచ్చాయి. ‘వాల్తేరు వీరయ్య’లో స్పెష‌ల్ రోల్‌తో కొంత మెప్పించినా, అది సోలో హిట్టుగా లెక్కలోకి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్స్ ఒక పక్కా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ‘మాస్ జాతర’కి పరిస్థితులు అన్నీ రివ‌ర్స్‌లో వ‌స్తున్నాయి.  ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడగా, ఇప్పుడు మళ్లీ కొత్త డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది.


మాస్ జాత‌ర‌ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన కంటెంట్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. విడుదలైన లిరికల్ సాంగ్‌లో బూతులు ఎక్కువున్నాయని నెగటివ్ కామెంట్లు వచ్చాయి. టీజర్ కూడా ఎక్స్‌ట్రా ఆర్డినరీగా కాకుండా రొటీన్‌గా ఉందంటున్నారు. రవితేజ వేగంగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ రేషియో మాత్రం లేదు. మాస్ జాత‌ర‌ ఆగస్టు 27న రిలీజ్ కాకపోతే కొత్త డేట్ ఎప్పుడు వేస్తార‌న్న‌ది క్లారిటీ లేదు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకూ ఇప్పటికే భారీ సినిమాలే క్యూలో ఉన్నాయి. నవంబర్ సాధారణంగా అన్‌సీజన్‌గా భావించబడుతుంది. అలాంటప్పుడు ‘మాస్ జాతర’కు సరైన రిలీజ్ స్లాట్ దొరకడం సవాలే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: