టాలీవుడ్ లో పవర్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. సొంత ప్రతిభతోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా `తొలిప్రేమ`, `తమ్ముడు`, `ఖుషి` సినిమాల తర్వాత పవన్ కు ఒక క‌ల్ట్‌ ఫాలోయింగ్ ఏర్పడింది. యూత్ ఆయన్ను ట్రెండ్ సెట్టర్ గా చూసేవారు. పవన్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, న్యాచురల్ యాక్టింగ్ అభిమానుల్లో ఆయ‌న‌కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేశాయి.


ఆ సంగతి పక్కన పెడితే.. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎన్నో చిత్రాలు చేశాడు. వాటిలో కొన్ని విజ‌యం సాధించగా, మ‌రి కొన్ని పరాజయం పాలయ్యాయి. అయితే ఏదో ఒక కారణం చేత పవన్ కళ్యాణ్ వదులుకున్న కథల జాబితా కూడా పెద్దగానే ఉంది. దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న మూవీస్ లో ఒక ఇండస్ట్రీ హిట్ బొమ్మ కూడా ఉంది. ఇంతకీ ఆ ఇండస్ట్రీ హిట్ మూవీ మరేదో కాదు `నువ్వే కావాలి`. కె. తరుణ్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. తరుణ్ కు భారీ స్టార్డ‌మ్ ను అందించింది.


కానీ నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సింది. విజయ భాస్కర్ ముందుగా పవన్ కళ్యాణ్, అమీషా పటేల్‌ను హీరో,హీరోయిన్లుగా పెట్టి నువ్వే కావాలి స్టోరీ తో షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ అనుకోని కారణాలతో ఆరంభంలోనే ఈ సినిమా అట‌కెక్కింది. ఆ తర్వాత కొద్ది రోజులకు తరుణ్ హీరోగా విజయ భాస్కర్ నువ్వే కావాలి సినిమాను తీశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి సంభాషణలు అందించారు. రిచా పల్లోడ్ హీరోయిన్‌.


ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రూ. 1.2 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన నువ్వే కావాలి మూవీ 2000వ సంవత్సరంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫుల్ ర‌న్ లో రూ. 19.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. 48వ‌ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నువ్వే కావాలి అవార్డును పొందడం మరొక విశేషం. ఏదేమైనా నువ్వు కావాలి మూవీ విష‌యంలో ప‌వ‌న్ నిజంగా అన్ ల‌క్కీనే.. ఫ్యాన్స్ కూడా ఇది ఒప్పేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: