భారత సినీ రంగంలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌త్యేకత ఏంటి..? ఈ పుర‌స్కారంతో తార‌ల‌కు ద‌క్కే ప్ర‌యోజ‌నాలు ఎలా ఉంటాయి..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.


దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేవలం ఒక బహుమతి కాదు, అది ఒక సినీ ప్రస్థానం మొత్తం మీద లభించే అజరామర గౌరవం. 1969లో భారత ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ఈ అవార్డు వెనుక ఉన్న విశేషాలు, ఆసక్తికరమైన అంశాలు చాలా మందికి తెలియకపోవచ్చు. దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుందిరాజ్ గోవింద్ ఫాల్కే. ఆయనను భారత సినిమాకు పితామహుడు అని పిలుస్తారు. 1913లో ఆయ‌న తీసిన `రాజా హరిశ్చంద్ర` భారత తొలి ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్. భారతీయ సినిమాకి పునాది వేసినందుకే ఆయన పేరు మీద ఈ అవార్డును ప్రారంభించారు. భారత ప్రభుత్వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ అవార్డును సాధారణంగా భారత రాష్ట్రపతి అందజేస్తారు.


ఏ భాష, ఏ విభాగం (నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు, సాంకేతిక నిపుణుడు) అయినా, సినిమాకు విశిష్టంగా సేవ చేసినవారికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది. భారతీయ సినిమాకి ఇచ్చే అన్ని అవార్డుల్లో ఇది శిఖర స్థాయి. ప్రతి ఏడాది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలోనే ఇది ప్రదానం చేస్తారు. అవార్డు కింద ఒక స్వర్ణకమలం, శాలువా, మరియు రూ. 10 లక్షల నగదు బహుమతిగా ఇస్తారు.


దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందడం ఒక కళాకారుని జీవితంలో అతిపెద్ద గుర్తింపు. ఈ అవార్డు ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు ల‌భిస్తుంది. సామాజిక, రాజకీయ వర్గాల్లోనూ గౌరవం మరింత పెరుగుతుంది. ప్రభుత్వ ప్రోగ్రాముల్లో ప్రత్యేక ఆహ్వానాలు, గౌరవ సన్మానాలు లభిస్తాయి. అలాగే ఈ అవార్డు పొందిన వారి పేర్లు శాశ్వతంగా భారత సినిమా చరిత్రలో నిలిచిపోతాయి.


ఇక ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న మహిళా కళాకారులు చాలా తక్కువ. యువకులు కూడా అరుదే. సాధారణంగా వయోవృద్ధులకే ఇస్తారు. కానీ కె.బాలచందర్, రజినీకాంత్ లాంటి వారు కొంత తక్కువ వయసులోనే పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మొదటి మహిళ దేవికా రాణి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, బి. నాగిరెడ్డితో స‌హా 7 నుండి 8 మంది తెలుగు ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: