సోషల్ మీడియాలో, బయట ప్రమోషన్లలో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిన సినిమా పేరు కాంతార చాప్టర్ 1. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు, భారీ హైప్… కానీ రిలీజ్‌ అయ్యాక కేవలం పదిరోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్‌ను దాటేసి శాండల్‌వుడ్ సెన్సేషన్‌గా నిలిచిన ఈ డివోషనల్ డ్రామా ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఇందులో హోంబాలే ఫిలిమ్స్ ఫాలో అవుతున్న ప్రత్యేకమైన స్ట్రాటజీ దాగి ఉంది. రిషబ్ శెట్టి నార్త్ మీడియాలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు తప్ప… ప్రత్యేక ప్రమోషన్ల హంగామా లేకపోవడం ఈ ప్లాన్‌లో భాగమే. ఇదే విధానం కేజీఎఫ్, సలార్ సినిమాలకూ వాడారు. టార్గెట్ ఆడియెన్స్ చేరుకున్నాక… ఎక్కువగా అతి ప్రచారం చేయకుండా సినిమాను నేచురల్ వర్డ్ ఆఫ్ మౌత్ మీద నడవనివ్వడం హోంబాలే బృందం ఫార్ములా. అదే ఇప్పుడు కాంతార చాప్టర్ 1కు కూడా వర్తిస్తోంది.


ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కూడా వీకెండ్ దగ్గరపడుతున్న టైంలో ఆక్యుపెన్సీలు పెరుగుతున్నాయి. అంటే సినిమా సైలెంట్ ప్రమోషన్‌లో ఉన్నా - కంటెంట్ బలం, వర్డ్ ఆఫ్ మౌత్ తో దూసుకెళ్తోందని చెప్పాలి. బాలీవుడ్ హ్యాండిల్స్ నుంచి వస్తున్న ప్రశంసలు, ప్రముఖ సెలబ్రిటీల ట్వీట్లు ఈ విజయానికి మరింత ఊపునిస్తున్నాయి. అయితే ప్రేక్షకులు, ట్రేడ్ సర్కిల్స్‌లో ఇంకో కామెంట్ బలంగా వినిపిస్తోంది - “ఈ సక్సెస్‌ను ఇంకా అగ్రెసివ్ ప్రమోషన్లతో కొనసాగించి ఉంటే… వెయ్యి కోట్ల క్లబ్ కూడా కాంతార చాప్టర్ 1 దాటేసేది!” అని. ఈ అభిప్రాయంలో నిజం లేకపోలేదు. ఎందుకంటే రిషబ్ శెట్టి సృష్టించిన ఈ మాస్ – డివోషనల్ బ్లెండ్ పాన్ ఇండియా మార్కెట్లో కూడా బాగా నడుస్తోంది.



మరోవైపు మన తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సీజన్ దగ్గరపడుతోంది. ఈ సీజన్‌లో డ్యూడ్, తెలసు కదా, కె ర్యాంప్, మిత్ర మండలి వంటి నాలుగు చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వీటిలో రెండు మూడూ యూత్ టార్గెట్ మూవీస్ కావడంతో కాంతారకు పోటీ పెరిగే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు సోమవారం నుంచి సాధారణ ధరలకు వస్తుండటంతో కాంతారకు రాబోయే వారం పికప్ అవ్వడానికి అవకాశం ఉంది. తెలంగాణలో అయితే ప్రభుత్వ గరిష్ట ధరతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం బ్రేక్ ఈవెన్ పై ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అయినా, దేశీయంగా కాంతార చాప్టర్ 1 ఊపుని ఎవరూ తట్టుకోలేరని ట్రేడ్ వర్గాల అంచనా. రిషబ్ శెట్టి ఈసారి కూడా తన సైలెంట్ స్ట్రాటజీతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: