కరోనా పోరులో భారత్ కి అండగా ఉండేందుకు ఎన్నారైలు కోవిడ్ 19 చికిత్సకు సంబంధించి వైద్య పరికరాలను భారతదేశానికి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన తెలుగు ఎన్నారైలు "తెలుగు కోవిడ్ టాస్క్ ఫోర్స్" ఫోరమ్ ఏర్పాటు చేసి పల్స్ ఆక్సి మీటర్స్, శానిటైజర్స్, గ్లోవ్స్, ఫేస్ మాస్క్స్, పీపీఈ కిట్స్, మందులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మండలాలను దత్తత తీసుకున్నారు.


డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ పి.రవి రాజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నారై వైద్యులైన సరస్వతి, రుద్రరాజు ఏర్పాటుచేసిన ఫోరమ్ 10 లక్షల రూపాయల విలువైన వైద్య సామాగ్రిని దానం చేసిందని.. వాటిని తిరుపతి, నగరి నియోజకవర్గాల్లో పంపిణీ చేశామని చెప్పారు. త్వరలోనే ఎమర్జెన్సీ కొరియర్ సేవల ద్వారా మరిన్ని వైద్య పరికరాలను పంపిణీ చేస్తామని ఎన్నారైలు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.



చిత్తూరు జిల్లాలోని వడమాల పేట, పుత్తూరు, నగరి, విజయపురం, నిండ్ర వంటి మండలాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని తోండంగి, ద్రాక్షారం, ఇంజారాం, పెద్దాపురం, అన్నవరం మండలాలను తెలుగు ఎన్నారైలు దత్తత తీసుకున్నట్టు రవి రాజు తెలిపారు. మరిన్ని మండలాల బాగోగులు చూసుకునేందుకు త్వరలోనే మరికొందరు వైద్యులు తెలుగు కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఫోరమ్ లో చేరబోతున్నారని ఆయన అన్నారు.



ప్రస్తుతం దత్తత తీసుకున్న మండలాల్లోని కోవిడ్ చికిత్స అందించే వైద్య సిబ్బందికి తెలుగు ఎన్నారై సీనియర్ డాక్టర్లు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. దత్తత తీసుకున్న మండలాలలోని ప్రతి గ్రామంలోని మెడికల్, పారామెడికల్ సిబ్బందికి అవసరమైన పరికరాలను పంపిణీ చేసేందుకు కూడా ఇండియన్ అమెరికన్లు ఆలోచనలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులలో వర్చువల్ సెషన్స్ ద్వారా స్థానిక వైద్యులకు సలహాలు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధం అని తెలుగు సీనియర్ ఎన్ఆర్ఐ డాక్టర్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: