అమెరికా దేశం అనుసరిస్తున్న పాత ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల, ముఖ్యంగా హెచ్-1బీ వీసాల కారణంగా, భారతీయ ప్రతిభావంతులు విసిగిపోతున్నారు. కాలం చెల్లిన వీసా విధానాల వల్ల భారతీయ ప్రతిభా వంతులు అమెరికా నుంచి కెనడాకు భారీ ఎత్తున తరలిపోతున్నారు. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు, విధాన నిర్ణాయక నిపుణులు అమెరికన్ చట్ట సభ్యులకు వెల్లడించారు. అంతేకాకుండా, ఎంతో టాలెంట్ ఉన్న భారతీయులను కోల్పోతున్నామని.. త్వరగా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులు చేయాలని నిపుణులు కాంగ్రెస్ ప్రతినిధులకు సూచించారు.

హెచ్‌1బీ వీసా విధానాలు, శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డుల జారీ విషయంలో అమెరికా దేశాలవారీగా నిర్ణీత కోటా విధించింది. ఆ కోటా దాటిన తర్వాత ఇక భారతీయులను అమెరికాలోకి అనుమతించడం లేదు. దీంతో ఇండియన్ యువతీ యువకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తమకు అమెరికా వీసాలు జారీ చేయడంలో జాప్యం చేస్తోందని భావిస్తూ అమెరికాకి బదులు కెనడాకి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నిపుణులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. పాతకాలపు వీసా విధానాలను సవరించే సమయం వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత గణాంకాల ప్రకారం.. మూడు కేటగిరీలకు చెందిన ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం 9,15,497 మంది దరఖాస్తులు చేశారు కానీ వారికి ఇప్పటివరకూ గ్రీన్‌కార్డులు జారీ కాలేదు. 9 లక్షల 15 వేల మంది భారతీయులు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని అమెరికన్‌ పాలసీ నేషనల్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్టువర్ట్‌ ఆండర్సన్‌ తెలిపారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సవరణలు సరళీకృతం చేయకపోతే 2030 సంవత్సరం లోపు గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూసే భారతీయుల సంఖ్య 21,95,795కి చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. ఇదే విషయాన్ని పౌరసత్వం, వలసల విషయాలపై ఏర్పాటు అయిన సభాకమిటీకి స్టువర్ట్‌ ఆండర్సన్‌ వివరించారు.

అమెరికన్ అధికారులు అప్రమత్తం కాకపోతే భారతీయులు గ్రీన్‌కార్డుల కోసం సంవత్సరాల తరబడి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల వల్లే విదేశీ ప్రతిభ అంతా కూడా ఇతర దేశాలకు తరలిపోతోందని ఆయన సభా కమిటీ ఎదుట స్పష్టం చేశారు. కెనడా దేశం అంతర్జాతీయ విద్యార్థులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వీసా విధానాలను సరళతరం చేసిందని.. అందుకే అంతర్జాతీయ విద్యార్థులు అందరూ కూడా కెనడా వైపే చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక గణాంకాల ప్రకారం గత నాలుగు సంవత్సరాల్లో అమెరికా దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య 25 శాతం తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: