తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  చంద్ర‌బాబు ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాలకోసమా? స్వప్రయోజనాల కోసమా అని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోడీని తిట్టిన సీడీనీ రాష్ట్రప‌తికి చూపించారా అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు ఢిల్లీకి ఎందుకు వ‌చ్చారు. అమిత్ షా మీద రాళ్లు వేసిన‌టువంటి వీడియో చూపించ‌డానికి వ‌చ్చారా..? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసాంఘిక శ‌క్తుల‌కు రారాజు చంద్ర‌బాబు అని పేర్కొన్నారు. బోస డీకే అనేది తిట్టు కాదు.. చాలా మంచి ప‌దం అన్‌పార్ల‌మెంట‌రీ కాదు, పార్ల‌మెంట‌రీ భాష అని చెప్ప‌డానికి చంద్ర‌బాబు వ‌చ్చాడా అని ఎద్దేవా చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టిప్ప‌టి నుంచి ఎన్టీరామారావు చ‌నిపోయేంత వ‌ర‌కు ప్ర‌తీ మ‌హానాడులో కూడ ఆర్టిక‌ల్ 356 ను ర‌ద్దు చేయ‌మ‌ని, ప్ర‌తీసారి తీర్మాణం చేస్తూ వ‌చ్చారు చంద్ర‌బాబు. కానీ  ఇప్పుడు అదే ఆర్టిక‌ల్ 356 ను అమ‌లు చేయ‌మ‌ని  రాష్ట్రప‌తిని కోర‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో ఏ ఎన్నిక‌ల్లో కూడ టీడీపీ గెలిచిన సంద‌ర్భంలో లేదు. దీనిని బ‌ట్టి  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీకి ఎంత ప్ర‌జాధ‌ర‌ణ ఉంద‌నేది అర్థం చేసుకోవ‌చ్చు. చంద్ర‌బాబు ముఖ్య‌మైన ఉద్దేశం.. సీఎం జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వాన్నిపూర్ లైన్‌లో చూపించ‌డం, 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా చేసిన చంద్ర‌బాబుకు బూతులు మాట్లాడ‌వ‌ద్ద‌ని తెలియ‌దా..?  ఉదేశ పూరితంగా పార్టీ వ్య‌క్తుల‌తో చెప్పిస్తున్నాడ‌ని పేర్కొన్నారు. అన్ పార్ల‌మెంట‌రీ భాష‌ను వాడితే ప్ర‌జ‌లు క‌చ్చితంగా తిర‌గ‌బ‌డుతార‌ని పేర్కొన్నారు. సెంట్ర‌ల్ క్యాబినెట్ మినిస్ట‌ర్ నారాయ‌ణ‌రానే ఉద్ద‌వ్‌థాక్రె పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ద‌యాశంక‌ర్‌సింగ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌  అప్ప‌టి ముఖ్య‌మంత్రి మాయ‌వ‌తిపై అస‌భ్యంగా మాట్లాడార‌ని గుర్తు చేశారు.  ముఖ్యంగా గంజాయి వ్యాపారంలో లోకేష్‌కు పార్ట్‌న‌ర్‌షిప్ ఉంద‌న్న విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు అని బాంబు పేల్చారు. చంద్ర‌బాబునాయుడు మాద‌క‌ద్ర‌వ్యాల వ్యాపారం చేసి రాష్ట్ర ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్లాల‌ని చూడ‌డం శోచ‌నీయం అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు దృష్టి సారించ‌లేక‌పోయిందంటే చంద్ర‌బాబు మ‌న‌స్థ‌త్వం.. ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగం మీద ఎటువంటి న‌మ్మ‌కం లేదు. ఎప్పుడు ఏ పార్టీతోనైనా క‌ల‌వ‌చ్చు. ఏపార్టీతోనైనా ఎప్పుడైనా విడిపోవ‌చ్చు.

 బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పదవిలో ఉన్న చంద్రబాబు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు. రాష్ట్రంలో నిత్యం అశాంతియుతమైన పరిస్థితులు సృష్టిస్తూ అరాచక పరిస్థితులకు ఆజ్యంపోస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నైజం తెలిసే వివిధ రాజకీయపార్టీల నేతలు, కేంద్ర హోం మంత్రి, ప్రధాని కూడా చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దేశంలో న్యాయవ్యవస్థను దూషిస్తే.. వారిపై అసభ్యపదజాలం వాడితే దానికి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది. కానీ ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని దూషిస్తే కేవలం నామమాత్రమైన సెక్షన్ మాత్రమే ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఒక చట్టం తీసుకురావాలని  వైసీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకువస్తాం అని వెల్ల‌డించారు. చంద్రబాబు ఒక ఉగ్రవాదిఅని,  ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి హింస ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉంది కాబట్టే పట్టాభి దేశం విడిచి పారిపోయాడు. తనను భౌతికంగా అంతమొందించి ఆ నెపాన్ని వైఎస్సార్ పార్టీ పై నెట్టేస్తాడు అని పట్టాభి భయపడుతున్నాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: