నెల్లూరు జిల్లా వెంకటగిరి సీనియర్ నేత, ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి పరిస్దితి విచిత్రంగా తయారైంది. మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వామపక్షాలతో పోరాటం చేస్తున్నాయి. కానీ వెంకటగిరిలో ఆనం మాత్రం ప్రతిపక్షాలతో తక్కువగా సొంతపార్టీలోని వారితోనే ఎక్కువగా పోరాటం చేస్తున్నారు. తాజాగా జిల్లాల పునర్విభజన వ్యవహారంతో ఆనం కేంద్రంగా వివాదం బాగా పెరిగిపోతోంది.
పునర్విభజనలో భాగంగా నెల్లూరులోని వెంకటగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన బాలాజీ జిల్లాలో కలిసిపోయింది. దాంతో ఆనం డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డిపైనే మండిపోతున్నారు. నిరాహార దీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఆనంకు టికెట్ దక్కేది అనుమానమని, అసలు పార్టీలోనే ఎక్కువరోజులుండరనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే సమయమని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్ అయిపోయారు.
ఇపుడు ఆనంకు ఎక్కడిక్కడ నేదురమల్లే కౌంటర్లిస్తున్నారు. ఆనం నోరిప్పితే చాలు నేదురుమల్లే వాయించేస్తున్నారు. ఇదే సమయంలో అవకాశం దొరికినపుడల్లా టీడీపీ నేతలు కూడా ఆనంకు గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. వైసీపీలో నుండి వచ్చేసి  ఆనం టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం తెలిసిందే. ఇందులో భాగంగానే సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలర్టయ్యారు. ఆనం టీడీపీలోకి వస్తే తనకెక్కడ ఇబ్బందులు మొదలవుతాయో అనే టెన్షన్ సోమిరెడ్డిని కుదిపేస్తోంది. అందుకనే సోమిరెడ్డి మద్దతుదారులు ఆనంపై ఫైరవుతున్నారు. 
మొత్తానికి ఆనం పరిస్ధితి ఎటూకాకుండా అయ్యేట్లుందనే టాక్ పెరిగిపోతోంది. వెంకటగిరిని బాలాజీ జిల్లలో కలపిన విషయంలో జనాల్లో నుండి ఎక్కడా వ్యతిరేకత లేదు. వ్యతిరేకతంతా ఆనం మద్దతుదారుల్లో మాత్రమే కనబడుతోంది. ఉన్న పార్టీలోను ఉండలేక, మళ్ళీ టీడీపీలోను చేరలేక ఆనం చివరకు ఏ బీజేపీలోనో లేకపోతే జనసేనలోనో చేరుతారేమో అనే సెటైర్లు కూడా మొదలైపోయాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకే దక్కుతుందనే ఆనందంలో నేదురుమల్లి యాక్టివ్ అయిపోవటమే కాకుండా ఆనం మీద రెచ్చిపోతున్నారు కూడా. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: