ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినీ రంగంపైన కూడా దృష్టి సారించడం చర్చనీయాంశమైంది. ఓజీ సినిమా ఇచ్చిన ఘనవిజయం ప‌వ‌న్ సినీ కెరీర్‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది. దీంతో ప‌వ‌న్ అటు రాజ‌కీయాల‌తో పాటు ఇటు సినిమాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఓజీ యూనివర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, బాలినేని శ్రీనివాసరెడ్డితో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టడం, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు రెడీ అవుతుండ‌డం చూస్తుంటే ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో పాటు సినిమాల‌ను బ్యాలెన్స్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు సంకేతాలు వ‌స్తున్నాయి.


కానీ సమస్య ఏమిటంటే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సినిమాలు చేయడం ఒకటైతే, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు రాజ‌కీయాలు.. సినిమాలు బ్యాలెన్స్ చేయ‌డం క‌ష్టం. ప‌వ‌న్ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కేవలం ఎమ్మెల్యే కాదు, ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక నిర్ణయాలు, కీలక అంశాలపై ఆయన నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో సినీ ప్రాజెక్టులకు కాల్‌షీట్లు కేటాయించడం వల్ల ప్రజలకు కేటాయించే సమయం తగ్గిపోతుందన్న వాదన ముందుకు వస్తోంది.


ఇప్పటివరకు విడుదల అవుతున్న సినిమాలు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యే ముందు ప్రారంభించినవే. అందువల్ల వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు లేవు. ప్రజలు కూడా వాటిని సహజంగానే అంగీకరించారు. కానీ ప‌వ‌న్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు మొదలుపెడితే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇది త‌ప్పుకాక‌పోయినా నైతికంగా స‌రికాద‌న్న అభిప్రాయాలు తెర‌మీద‌కు వ‌స్తాయి. ఇది రాజకీయంగా ఆయనకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు.
ప్రజలు తమ సమస్యలను పరిష్కరించమని నేతలను ఎన్నుకుంటారు. కానీ ఆ నేత సినిమాల్లో ఎక్కువ సమయం కేటాయిస్తే, ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనకు వస్తారు. అలాంటి పరిస్థితిలో ఆ నాయకుడి పట్ల ఉన్న నమ్మకం, మద్దతు క్రమంగా తగ్గిపోతుంది.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిచేసిన సినిమాలపై ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త సినిమాలు ప్రారంభించడం మాత్రం పవన్ కల్యాణ్‌ నిజాయితీపై అనుమానాలను పెంచుతుంది. ఏదేమైనా ప‌వ‌న్ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం ఆప‌క‌పోతే ప‌వ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: