పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆస్తిని మనమే నాశనం చేసుకుంటే, దాని ఫలితాలు ఎంత తీవ్రమై ఉంటాయో చరిత్ర చెబుతోంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు బెంగళూరును ప్రపంచ ఐటీ హబ్‌గా మార్చిన దూరదృష్టి కలిగిన పాలకుల కృషి, వారు నిర్మించిన ఎకో సిస్టమ్ వల్ల‌ రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కానీ ప్రస్తుత పాలకులు ఆ కష్టంతో కూడిన ప్రతిష్టను కాపాడుకోవడంలో విఫలమవుతున్నార‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు కొత్తవి కావు. అయితే రోడ్లపై గుంతలు,  సదుపాయాల లేమి కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ సమస్యలపై ప్రశ్నించిన ఒక స్టార్టప్ సీఈఓ సోషల్ మీడియాలో “ఆఫీస్‌ను మార్చుకోవాలని అనుకుంటున్నా” అని రాస్తే, సమస్య పరిష్కారానికి ప్రయత్నించ‌కుండా.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ ఇచ్చిన ఆన్స‌ర్ ప్ర‌తి ఒక్క‌రికి షాక్ ఇచ్చింది.


“ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లండి, బ్లాక్ మెయిలింగ్‌కు లొంగం” అని ఆయన తేల్చేయడం పారిశ్రామిక వేత్తల మన్నన పొందలేదు. సమస్యను పరిష్కరిస్తారని భావిస్తే ఆయ‌న ఇలా నిర్లక్ష్యంగా ఆన్స‌ర్ చేయ‌డం ఎవ్వ‌రికి న‌చ్చ‌లేదు. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి ఐటీ పరిశ్రమలను ఆహ్వానిస్తున్న నారా లోకేష్‌పై ఆయన ఫైరయ్యారు. “మేము సుసంపన్నులం, మా ఓవర్‌ఫ్లోస్‌ను తీసుకోవడానికి చకోర పక్షుల్లా ఎదురు చూడొద్దు” అని చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు కన్నడ జ‌నాల‌కే న‌చ్చ‌డం లేదు.


ఏపీ మంత్రి నారా లోకేష్ మాత్రం పెట్టుబడులపై ఎంత చిన్న అవకాశం ఉన్నా వదులుకోవడం లేదు. సోషల్ మీడియాలోనూ ఎటువంటి మొహమాటం లేకుండా ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. అనంతపురం వద్ద ఇప్పటికే కియా మోటార్స్ ఉండడం, అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు ప్రతిరోజూ బెంగళూరుకు వెళ్తుండడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఈ నేపథ్యంలో అనంతపురం సహజంగానే ఐటీ పరిశ్రమలకు దగ్గర ప్రదేశమవుతుంది. కియా వల్ల కర్ణాటక కూడా లాభపడుతూనే ఉంది. కానీ లోకేష్ మాత్రం కర్ణాటకను విమర్శించడం కాకుండా తమ రాష్ట్రాన్ని ప్రోత్సహించడంపైనే దృష్టి పెట్టారు.


ఇదే సమయంలో కర్ణాటక మంత్రులు సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయకుండా, పొరుగు రాష్ట్రాలను కించపరచడమే చేస్తూ ఉండడంపై అక్క‌డే మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తం అవుతోంది. ఐటీ పరిశ్రమల భవిష్యత్తు అహంకార వ్యాఖ్యలతో కాకుండా, సమర్థవంతమైన పాలనతోనే కాపాడబడుతుంది. కానీ ప్రస్తుత కర్ణాటక పాలకుల వైఖరి చూసినప్పుడు, తమ చేతకానితనాన్ని మర్చిపెట్టేందుకు ఇతర రాష్ట్రాలపై విమర్శలు చేయడమే మార్గమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికీ నష్టం కలిగించే పరిస్థితిని తీసుకొస్తుందనేది స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: