
ఆ సామాజిక వర్గమే శాపమైందా..?
సీఎం జగన్ సామాజిక న్యాయం, సాధికారత అనే వ్యూహంతో మంత్రి పదవుల్లో ఎక్కువశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కట్టబెడుతున్నారు. మహిళల వాటా కూడా ఎక్కువే. ఈ దశలో జగన్ సొంత సామాజిక వర్గంలో అసంతృప్తుల సంఖ్య బాగానే పెరిగిపోతోంది. అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించడం మినహా జగన్ కి ఇంకే ప్రత్యామ్నాయం దొరకడంలేదు. అలా ఆ సామాజిక వర్గం వల్ల ఇబ్బంది పడుతున్నవారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒకరు.
అప్పటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆయన తనయుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు. అలాంటి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారంటే ప్రత్యర్థిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత టెన్షన్ పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా ఆయన అక్కడ వైసీపీ జెండా ఎగరేశారు. లోకేష్ కి చుక్కలు చూపించారు. రెండో దఫా కూడా లోకేష్ మంగళగిరినే ఎంపిక చేసుకున్నా ఆళ్ల తనదైన శైలిలో మందుకెళ్తున్నారు. ఈ దశలో ఆళ్లకు మంత్రి పదవి దక్కితే మరింత ఉత్సాహంగా ఉండేది. అయితే ఆయనకు ఆ ఛాన్స్ దొరకలేదు. మంత్రి పదవి లేకపోవడంతో ఆళ్ల నిరాస చెందారు. అయితే జగన్ కి తాను విధేయుడినేనని చెబుతున్నారాయన.
మంత్రి పదవి కంటే సీఎం జగన్ మనసులో స్థానమే తనకు అత్యంత ముఖ్యమని అన్నారు ఎమ్మెల్యే ఆళ్ల. 6 నెలల క్రితమే సీఎం జగన్ ను తాను కలిశానని, సామాజికవర్గ పరంగా తనకు మంత్రి పదవి ఇవ్వడంలో ఇబ్బందులుంటే తనకు ఆ పదవి అవసరం లేదని చెప్పానని అన్నారు ఆళ్ల. , నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం జగన్ ని కోరినట్టు తెలిపారు. రాజకీయాల్లో ఉంటే తానెప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు ఆళ్ల. రాజకీయాల్లో లేకపోతే తన పొలంలో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. మొత్తమ్మీద మంత్రి పదవి ఆశించి అసంతృప్తికి లోనైనా.. ఇప్పుడిలా జగన్ కి జై కొట్టేశారు ఆళ్ల.