వైద్యరంగంలో కొత్త పోకడలు వస్తున్నాయి. అధునాతన వైద్యపరికరాల కారణంగా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు దక్షిణాసియాలోనే తొలి మెడ్ టెక్ పార్క్ విశాఖలో ఏర్పాటవుతోంది. విశాఖ శివార్లలోని పెదగంట్యాడ వద్ద ప్రభుత్వం రెండొందల ఎకరాలలో ఈ మెడ్ టెక్ పార్క్ కి కేటాయించింది.
ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి శంకు స్ధాపన చేస్తారు. మెడ్ టెక్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్ధకు ఛైర్మన్ గా పూనం మాలకొండయ్య వ్యవహరిస్తున్నారు. ఆమె సిన్సియారిటీ అందరికీ తెలిసిందే. బుధవారం విశాఖలో జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికార్లతో సమీక్ష నిర్వహించారు.

మెడ్ టెక్ పార్క్ ఏర్పాటు ద్వారా స్ధానికులకు ఉపాధి లభించడంతో పాటు, తక్కువ ధరకు మెడికల్ పరికరాలు లభించే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు ఈ పార్క్ పట్ల అత్యంత శ్రద్ద చూపించారు. పూనం సహా ఇతర ఉన్నతాధికార్లు ఈ పార్క్ ఏర్పాటయ్యే ప్రాంతాన్ని సందర్శించి బృహత్తర ప్రణాళికపై చర్చించారు.
చంద్రబాబు గతంలో చైనా పర్యటన సందర్భంగా అక్కడ ఈ తరహా పార్కును చూశారట. విశాఖలో అలాంటిది పెట్టాలని నిర్ణయించారట. విశాఖకు ప్లస్ పాయింట్ అది ట్రాన్స్ పోర్ట్ హబ్ కావడమే. విశాఖ జిల్లా నడుపూరులో తొలుత 270 ఎకరాలలో జోన్ ఏర్పాటుచేస్తారు. 200కు పైగా కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపాయి.