వైసీపీ- బీజేపీ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. జగన్ సీఎం కాక ముందు.. అయిన కొద్దిరోజుల తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కాస్త తేడా కొడుతోందన్న వాదన వినిపిస్తోంది.
ప్రత్యేకించి ఏపీలో బలపడాలని బీజేపీ కోరుకోవడం.. అందుకు అనుగుణంగా పావులు కదపడం వైసీపీని ఇబ్బందిపెడుతోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ స్థానాన్ని భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాస్త సామరస్యం చెడిందనే చెప్పాలి.
అందుకే గతంలోలా కాకుండా ఇష్యూ బేస్డ్ గా వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. తాజాగా ట్రిపుల్ తలాక్ ఇష్యూలోనూ వైసీపీ బీజేపీని వ్యతిరేకించింది. అయితే రాజ్యసభలో ఓటింగ్ సమయంలో గైర్హాజరు కావడం ద్వారా పరోక్షంగా సహకరించినట్టయింది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వైసీపీ ఎంపీకి ఓ కీలక పదవి అప్పగించారు. కోకోనట్ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చింతా అనురాధ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం అధికారంగా ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోకోనట్ బోర్డును పనిచేస్తుంది.
దేశంలో కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి, కొబ్బరి సాగు విస్తర్ణం పెంచడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన అనురాధ అమలాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
కొబ్బరి విషయంలో ఆంధ్రప్రదేశ్ కూడా కీలక ఉత్పత్తిదారుగానే ఉంది. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాలు కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. పచ్చటి కోనసీమకు ఈ కొబ్బరి తోటలు ప్రత్యేక అందాన్నిస్తాయి. అయితే కొబ్బరి ఉత్పత్తుల తయారీలో ఆధునిక పద్ధతులు, ఉపాధి మార్గాలను మెరుగుపరచడంలో ఈ ఎంపీ కృషి చేస్తే.. ఈ పదవికి సార్థకత లభిస్తుంది. మరి చింతా అనురాధ ఏ మేరకు కృషి చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి