ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కడప జిల్లా సింహాద్రి మండలానికి చెందిన శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.


ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులరెడ్డి ప్రాణాలొదిలాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు పిలిచినందువల్లే శ్రీనివాసుల రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో విశేషం ఏంటంటే... వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే నార్కో పరీక్షలు చేయించుకున్న పరమేశ్వర రెడ్డికి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసులరెడ్డి స్వయంగా బావ అవుతాడు.


మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. నిజా నిజాలను నిగ్గుతేల్చేందుకు సిట్ వేసినా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు కేసు కొలిక్కి వచ్చేసిందని చెబుతున్నా ఉపయోగం కనిపించడం లేదు. ఇప్పటికే వివేకా సన్నిహితులు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, శేఖర్‌రెడ్డి, శివశంకరరెడ్డి, నాగప్ప, వాచ్‌మెన్‌ రంగన్న, వంటమనిషితో సహా మరి కొందర్ని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.


వీరిలో కొందరికి గుజరాత్ తీసుకెళ్లి మరీ నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించారు కూడా. ఇది రాజకీయ హత్యా? ఆర్థిక లావాదేవీల వ్యవహారమా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఈ కేసు విచారణ సిట్ నుంచి వేరే సంస్థకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత సీఈసీకి విన్నవించారు. తాజాగా కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్.. ఈకేసును త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన తన బాబాయి విగ్రహాన్ని పులివెందులలో ఆవిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: