పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. అప్పులు పెరిగాయి.. రాబడి తగ్గింది.. ఎప్పుడూ ఆదుకునే అమెరికా ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతోంది. ఇటీవల ఓ పెట్టుబడల సదస్సులో పాకిస్తాన్ చేసిన ఓ సిగ్గుమాలిన నిర్వాకమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.


అసలేం జరిగిందంటే.. అజర్ బైజాన్ లో పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం ఓ సదస్సు ఏర్పాటు చేసింది. దానికి హాజరైన పారిశ్రామిక వేత్తలను ఖుషీ చేసేందుకు అమ్మాయిల అందాలను పెట్టుబడిగా పెట్టింది. బెల్లీ డాన్సర్లతో ప్రత్యేకంగా డాన్స్ షో ఏర్పాటు చేసింది. పాపం.. పాక్ ప్రయత్నం కాస్త ఫలించినట్టే ఉంది. ఈ సదస్సుకు వచ్చిన ఓ పారిశ్రామిక వేత్త ఓ బెల్లీ డాన్సర్ టాలెంట్ కు ఖుషీ అయ్యాడు.. అక్కడే ఆమెతో ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాడు.


ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ వీడియోపై పాక్ నెటిజన్లు మండిపడుతున్నారు కూడా. పాక్ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్న నయా పాకిస్థాన్ ఇదేనా అంటూ కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పాకిస్థాన్ ఇలా బెల్లీ డాన్స్ ఏర్పాటుచేయడంపై ఆ దేశ మహిళా జర్నలిస్ట్ గుల్ బుఖారీ మండిపడ్డారు. ప్రభుత్వ దిగజారుడుతనంపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.


భారత్ చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ ను విమర్శించిన పాకిస్థానీ నేతల దగ్గర పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు ఆడాళ్ల అందాల ఆరబోత తప్ప వేరే ఉపాయం లేదా అని మండిపడుతున్నారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబుడులు పెట్టాలంటే.. చాలా ఆలోచిస్తారు..ఇలా అమ్మాయిల అందాలు ఎర వేస్తే చాలు.. అనుకుంటే అది పాక్ అమాయకత్వమే అవుతుంది. అందులోనూ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాక్ లో పెట్టుబడులు అంటే అంత సులభం కాదుగా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: