అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతిపై కన్నేశారా.. భారత్- పాక్ మధ్య 70 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించి నోబెల్ కొట్టేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారా.. ట్రంప్ వ్యవహారం చూస్తే అలాగే కనిపిస్తోంది. మోడీ ఎంత వద్దన్నా ట్రంప్ పదే పదే అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్ పేరు ఎత్తుతున్నారు.


భారత్ వైఖరిని సమర్థిస్తూనే పదే పదే కాశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ఉబలాటపడుతున్నారు. మోడీ ఎంత వద్దని మొత్తుకుంటున్నా ట్రంప్ మాత్రం కాశ్మీర్ పై ఆశలు పెట్టేసుకుంటున్నారు. తాజాగా కాశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ స్పందించింది.


ఇప్పటికే ఈ విషయంపై భారత్ వైఖరిని స్పష్టం చేశామని తెలిపింది. కాశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని భారత్ ఇప్పటికే అనేకసార్లు తేల్చి చెప్పింది. అయినప్పటికీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ సందర్భంగా ఇరు దేశాలు ఒప్పుకుంటే కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.


భారత్-పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాల పరిష్కారంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని ట్రంప్ సమక్షంలోనే మోడీ స్పష్టం చేశారు. అయినా ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తాజాగా ఇద్దరి మధ్య జరగబోయే ద్వైపాక్షిక భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఈ భేటీలో ట్రంప్ మళ్లీ ఏం మాట్లాడతారో చూడాలి.


అంతే కాదు.. ట్రంప్ నోబెల్ ప్రేమను చాటే మరో తాజా ఘటన చోటు చేసుకుంది. తనకు ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతి రావాల్సిందంటూ ఆయన కాంట్రావర్సీ కామెంట్లు చేశారు. ఈ విషయంలో నోబెల్ కమిటీ తనకు అన్యాయం చేసిందని మొత్తుకుంటున్నారు. ప్రపంచంలో శాంతిస్థాపన కోసం తాను చాలా పనులు చేశానని ట్రంప్ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన కొన్నిరోజులకే ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఒబామాకు నోబెల్ ఎందుకిచ్చారో బరాక్ కు కూడా తెలియదని వెటకారం ఆడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: