వంగవీటి రంగా.. ఆంధ్రా రాజకీయాల్లో ఒకప్పటి సంచలనం.. విజయవాడ రాజకీయాలను శాసించిన యువనేతగా రంగాకు పేరుంది. అనూహ్యంగా ఆయన హత్యకు గురవడం అప్పట్లో విజయవాడలో పెను సంచలనంగా మారింది. నిరాహారదీక్ష చేస్తున్న రంగాను కొందరు దీక్షాస్థలంలోనే నరికి చంపేశారు. ఆ హత్య జరిగిన సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్య తెలుగుదేశం పార్టీయే చేయించిందని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి.
అప్పుడే కాదు.. ఇప్పటికీ రంగాను తెలుగుదేశం చంపించిందేనే వాదనే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అందుకే వంగవీటి కుటుంబం రంగా హత్యానంతరం రాజకీయాల్లో కాంగ్రెస్ లో కొనసాగింది. ఆ తర్వాత పార్టీల మారినా తెలుగుదేశం వైపు మాత్రం వెళ్లలేదు. కానీ గత ఎన్నికల ముందు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన్ను చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ గా నియమించారు కూడా.
అయితే ఇప్పుడు రంగా వర్థంతి వేళ మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. అసలు రంగా చనిపోయింది ఎన్టీఆర్ హయాంలో కాదని.. ఆయన కుమారుడు రాధా టీడీపీలోకి వెళ్లిన రోజే రంగా చనిపోయారని అంటున్నారు బీజేపీ నేత వంగవీటి నరేంద్ర. తన తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధ ఎప్పుడైతే చేరారో.. అప్పుడే వంగవీటి రంగా నిజంగా చనిపోయారని నరేంద్ర అన్నారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని వంగవీటి నరేంద్ర అన్నారు. రంగాను చంపింది మనుషులు కానీ.. పార్టీ కాదు రాధా బాబు అనడం.. రంగ-రాధా అభిమానులు జీర్ణించుకోలేక పోయారన్నారు నరేంద్ర. టీడీపీ తరఫున ప్రచారానికి వెళ్లిన వంగవీటి రాధాను మండపేటలో రంగా అభిమాన సంఘాలు వ్యతిరేకించిన విషయాన్ని నరేంద్ర గుర్తు చేశారు. ఇప్పటికైనా వంగవీటి రంగాను చంపింది టీడీపీ నాయకులేనని రాధా తెలుసుకోవాలని నరేంద్ర అంటున్నారు. మరి ఈ మాటలు రాధా చెవిన పడతాయా.. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి