తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ నోటిఫకేషన్ ఆదివారం జారీ అయ్యింది. మేయర్, ఛైర్ పర్సన్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకానున్న నేపథ్యంలో హైకోర్టు షాక్ ఇచ్చింది.

 

 

ఈ నోటిఫికేషన్ పై ఫిర్యాదుపై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదే వేసింది. అయితే.. రేపటి వరకూ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో నోటిఫికేషన్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై రేపు ఎలాంటి తీర్పు వస్తుందోనన్న సస్పెన్స్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.

 

ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసిన మరునాడే నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానం వస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రెండురోజులకే అంటే ఈ నెల 8వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించడం సందేహాం తలెత్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచి నామినేషన్ వేయడానికి మధ్య సమయం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 

మున్సిపల్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడబోదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటుందని చెప్పారు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయం సాధించేందుకు అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. అందుకోసమే నోటిఫికేషన్, నామినేషన్ ప్రక్రియ వెంట వెంటనే సమయం కేటాయించారని పేర్కొన్నారు.

 

మరోవైపు.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. 120 పురపాలక సంఘాలు, 10 నగర పాలక సంస్థలకు ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వార్డులను రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేసింది. బీసీలకు 29.40 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 5.83 శాతం, ఎస్సీలకు 14.15 శాతం దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: