కవిత ఈ పేరుకు తెలంగాణలో పరిచయం అక్కర్లేదు. కెసిఆర్ కూతురుగానే కాకుండా సొంతంగా తనకంటూ పార్టీలోనూ, ప్రజల్లోనూ ఒక గుర్తింపు తెచ్చుకొని తెలంగాణ రాజకీయాల్లో ఆమె హవా చూపించారు. దీనికి తండ్రి సీఎం కేసీఆర్, అన్న మంత్రి కేటీఆర్ తగిన సహాయ సహకారాలు అందించడంతో ఆమె మరింతగా రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్లారు. ఎంపీగా ఆమె ఢిల్లీలో టిఆర్ఎస్ తరఫున చక్రం తిప్పారు. కానీ ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె అనూహ్యంగా నిజామాబాద్ ఎంపీ గా ఓటమి చెందడంతో పూర్తిగా నిరాశ చెందారు. దానికి సొంత పార్టీకి చెందిన నాయకులే కారణం అని తెలియడంతో ఆమె మరింతగా కుంగిపోయారు.

 

ఆ బాధ నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాకుండా ఆమెకు రాజ్యసభ కు పంపించాలని కెసిఆర్ భావిస్తున్నారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కవిత యాక్టివ్ అవ్వడం  ద్వారా మహిళల్లోనూ, కార్యకర్తల్లోనూ పార్టీపై నమ్మకం పెరుగుతుందని కెసిఆర్ భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆమె మొదటి నుంచి తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి  మహిళలను ఉద్యమం వైపు నడిపించారు. టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కవిత మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేరు. తనకు పదవి ఇచ్చే విషయంలో కెసిఆర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇప్పుడు ఆమె అలిగి అమెరికాకు వెళ్లి పోయినట్టు టిఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 


 ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ కూడా మౌనం వహించడంతో ఇదే నిజం అనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. అలాగే కవిత అమెరికాకు వెళ్లడం వెనుక మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారం ఉన్నట్టు మరో కొత్త వాదన తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం టికెట్ల కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మొదటి నుంచి కవిత తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉండటంతో ఆమెను ప్రసన్నం చేసుకుని టికెట్లు సంపాదించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ తలపోట్ల నుంచి తప్పించుకునేందుకు ఆమె అమెరికాకు వెళ్లారని, టికెట్ల వ్యవహారం ముగిసిన తర్వాత ఆమె తిరిగి వచ్చి పార్టీలో యాక్టివ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు కవిత కానీ టిఆర్ఎస్ అగ్రనాయకులు గాని నోరు మెదపకపోవడంతో ఆమె అలిగారా ? లేక తప్పించుకున్నారా అనేది క్లారిటీ లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: