ఎన్నో ఆశలతో 2019 ఎన్నికల బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఘోర ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏదో పొడిచేస్తారనుకుంటే కేవలం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకున్నారు. సరే ఒకటైన గెలుచుకున్నామన్న ఆనందం పవన్‌కు కొన్ని నెలల్లో ఆవిరైపోయింది. సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలనకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఫిదా అయిపోయారు. అవకాశం దొరికినప్పుడల్లా జగన్‌కు జై కొడుతూ....జనసేన గాజు గ్లాసుని ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు.

 

జగన్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రాపాక కాస్త అటు ఇటూగా ఉండేవారు. కొంచెం జగన్‌ని పొగుడుతూనే, జనసేనాని బాటలో నడిచేవారు. అయితే ఒకానొక దశలో జగన్‌పై బాగా విమర్శలు చేశారు కూడా. కానీ ఎప్పుడైతే జగన్ ప్రజలకు సరికొత్త సంక్షేమ పథకాలు అందించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి రాపాక లైన్ మారింది. జగన్‌ని అసెంబ్లీ సాక్షిగా పొగడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జనసేనలో రాపాకకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం, పవన్..బాబు బాటలో వెళుతూ జగన్ ప్రభుత్వంపై అనసవరపు విమర్శలు చేస్తుండటంతో రాపాక మనసు మారుతూ వచ్చింది.

 

ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయానికి రాపాక సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే ప్రతి దశలోనూ జగన్‌పై ప్రశంసలు కురిపించడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడు రాజధానులకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో పవన్ వ్యతిరేకంగా ఉండాలని ఆదేశాలని జారీ చేసిన, వాటిని ఏ మాత్రం లెక్క చేయకుండా రాపాక జగన్‌కు జై కొట్టి పవన్‌కు షాక్ ఇచ్చారు. ఇక పనిలో పనిగా జగన్‌ని మరింత పొగిడి జనసేన గాజు గ్లాసుని ముక్కలు చేస్తూ...ఫ్యాన్ కింద సేద తీరేందుకు పూర్తిగా ఫిక్స్ అయిపోయారు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీలోని వల్లభనేని వంశీ, మద్దాలి గిరిల మాదిరిగా రాపాక కూడా రెబల్ ఎమ్మెల్యేగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: