ఇంకేముంది త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో వైసిపి చేరుతుంది... క్యాబినెట్ లో వైసీపీకి రెండు మూడు మంత్రి పదవులు వస్తాయి. ఎన్డీఏ కూటమిలో వైసిపి చేరుతుంది అనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర, రాష్ట్ర సంబంధాలు కూడా బలపడడం, జగన్ నిర్ణయాలకు బిజెపి పెద్దలు అంగీకారం తెలుపుతూ , వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆమోదిస్తూ వస్తుండడంతో వైసీపీ ఎన్డీయేలో చేరడం ఖాయం అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ పరిణామాలు అన్నీ నిజమే అన్నట్లుగా వైసీపీ బీజేపీ వ్యవహారాలు రుజువు చేసాయి. అయితే జగన్ మాత్రం ఎన్డీయేలో చేరే విషయంలో ఇంకా ఒక స్పష్టమైన క్లారిటీ కి రాలేనట్టుగా తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు కూడా జగన్ చూపిస్తున్నారు.


 ఎన్డీఏలో చేరకుండా కేంద్రంతో సఖ్యతగా ఉంటూ బయట నుంచి మద్దతు ఇస్తూ అండగా ఉండాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీనికి కారణం వైసీపీకి ఉన్న బలమైన మైనారిటీ ఓటుబ్యాంకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయం గురించే జగన్ ఎన్డీయేలో చేరేందుకు వెనుక ముందు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం బిజెపికి ఒక్కో రాష్ట్రంలో పట్టు కోల్పోతూ వస్తుండడంతో ప్రాంతీయ పార్టీలు తమకు అండగా ఉన్నాయి అన్న సంకేతాలను బయటకి చూపించుకునేందుకు ..  వైసీపీ మద్దతు కోసం మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఇటీవల జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడిన మోడీ అమిత్ షా లు దీనిపైన ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దేశమంతా  సీఏఏ విధానం పై విరుచుకు పడుతున్న పరిస్థితుల్లో వైసిపి తమకు రాజకీయంగా కలిసి వస్తుందని బిజెపి ఆలోచిస్తోంది. అయితే జగన్ మాత్రం ఈ సమయంలో ఎన్డీయేలో చేరితే మైనారిటీ ఓటు బ్యాంకు దెబ్బతినడమే కాకుండా తమ విశ్వసనీయత పోతుందని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకే బయటి నుంచి మద్దతు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంతో సఖ్యతగా ఉండడం ద్వారా ఏపీకి అవసరమైన నిధులను సాధించుకుని, తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: