రాష్ట్రంలో 50శాతం పైబడి ఉన్న బడుగు, బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, రిజర్వేషన్ల తగ్గింపుద్వారా ఆయా వర్గాలకు జగన్ చేసిన తీరని మోసాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈరోజు అయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలిశారు.  వినతిపత్రం అందజేశారు.  బడుగు, బలహీనవర్గాలు  సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యున్నతస్థానాలకు ఎదిగారంటే, అందుకు కారణం  టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావేనని అచ్చెన్నాయుడు తెలిపారు. 


తెలుగుదేశం ఏర్పడక ముందు,ఆనాడున్న ప్రభుత్వాలన్నీ బీసీలను ఓటుబ్యాంకుగానే చూశారన్నారు. ఇన్నేళ్ల రాష్ట్రచరిత్రలో ఎన్నడూ, ఎవరూ చేయని విధంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డే బీసీలను అణచివేసే కార్యక్రమాలను కొనసాగించారన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు అన్నివేళలా అండగా ఉంటున్నారన్న అక్కసుతోనే జగన్, వారిపై కక్షసాధింపులను కొనసాగిస్తున్నాడన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తామంతా గవర్నర్ ను కోరడం జరిగిందన్నారు. 

వైసీపీకి చెందిన బీసీనేతలెవరూ రిజర్వేషన్లు తగ్గినా నోరెత్తడంలేదన్నారు. ఎన్టీఆర్ దయవల్ల అనేకమంది బీసీలు స్థానికసంస్థల ఎన్నికల్లో నిలిచి, ప్రజలమద్ధతుతో గెలిచి, పదవులు పొందితే, నేరు వారికి ఆ అవకాశం దక్కకుండా చేయడం కోసం జగన్ కంకణం కట్టుకున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చర్యలవల్ల స్థానికసంస్థల్లో 16వేల పదవులు బీసీలకు దక్కకుండా పోతున్నాయని మాజీమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి రాకముందు బీసీలను ఆదుకుంటానని, వారికి రిజర్వేషన్లు తగ్గకుండా చూస్తానని చెప్పిన జగన్, నేడు వారి అధికారాలను కత్తిరించడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. 1994లో నాటి టీడీపీ ప్రభుత్వం  పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు దక్కేలా శాసనసభలో ఆమోదం చేయడం జరిగిందన్నారు. 

 

తరువాత జరిగిన 4 పర్యాయాల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లకుకోతపడలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుకూడా 34శాతం రిజర్వేషన్లే అమలయ్యాయని, 2013లో కూడా అదే దామాషాప్రకారం బీసీలు స్థానికసంస్థల్లో పోటీచేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే బీసీల రిజర్వేషన్లకు కోతపడిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయంటే.. అందుకు సుప్రీంకోర్టు తీర్పుని జగన్ ప్రభుత్వం సాకుగా చూపుతోందని, 2010లో సుప్రీం తీర్పుచెప్పినా, 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, 60.55 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించారన్నారు. 

 

ఆనాడు కిరణ్ ప్రభుత్వంపై కూడా సుప్రీంకోర్టులో కేసులు వేశారని, కానీ సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ బీసీవర్గాలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తే, ఆనాడు అత్యున్నతన్యాయస్థానం 60.55 శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించడం జరిగిందన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  మాత్రం హైకోర్టు తీర్పునే అమలుచేయడానికి ముందుకెళుతోందని, బీసీలకు అన్యాయం చేయడానికే సిద్ధపడుతోందన్నారు. వైసీపీకి చెందిన వారే సుప్రీంకోర్టులో కేసులువేస్తే, బీసీలకు అన్యాయం జరగడానికి తనపార్టీవారే కారణమైనప్పటికీ జగన్ ఎందుకు స్పందించడంలేదన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: