మిత్రపక్షం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కమలంపార్టీ నేతలు మండిపోతున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ+సిపిఐ తో జనసేన నేతలు పొత్తులు పెట్టుకున్నారు. నియోజకరవర్గంలోని ఎంపిటిసి, జడ్పిటిసి, సర్పంచు స్ధానాల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవటాన్ని బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలోని కొన్ని స్ధానాల్లో టిడిపితోను మరికొన్ని స్ధానాల్లో టిడిపి, సిపిఐతో జనేసేన నేతలు, కార్యకర్తలు కలిసిపోయారు.

 

ఒకవైపేమో బిజెపి నేతలు చంద్రబాబునాయుడుపై పోరాటాలు చేస్తున్నారు. ఈ కోణంలో కూడా తెలుగుదేశంపార్టీతో పొత్తుల ప్రసక్తే ఉండదని పదే పదే చెబుతున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే. అదే సమయంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి రెండు పార్టీల నేతలు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదు లేండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిజెపి నేతలకేమో ఎన్నికలపై పెద్ద ఆసక్తి లేదు. జనసేన నేతలకేమో పోటి చేయాలని ఉన్నా పార్టీ అండలేదు.

 

ఈ నేపధ్యంలోనే  ఎన్నిసార్లు రెండు పార్టీల నేతల మధ్య భేటిలు జరుగుతున్నా  చర్చలు  ఓ కొలిక్కి రావటం లేదు. ఈ నేపధ్యంలోనే నామినేషన్ల తేదీలు దగ్గరకు వచ్చేయటంతో జనసేన స్ధానిక నేతలు టిడిపి, సిపిఐ పార్టీలతో సొంతంగానే  పొత్తులు పెట్టేసుకున్నారు. రాష్ట్రపార్టీ నాయకత్వంతో ఏమాత్రం సంబంధం లేకుండానే నియోజకవర్గంలోని నేతలు పొత్తులు పెట్టుకోవటాన్ని పార్టీ నాయకత్వం పెద్ద పట్టించుకోలేదు. కానీ బిజెపి నేతలు మాత్రం మండిపోతున్నారు.

 

స్ధానిక సంస్ధల ఎన్నికలు అంటే పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేసే గడువు కూడా అయిపోవటంతో  నియోజకవర్గాల వారీగా ఇంకెక్కడ పొత్తులు పెట్టుకున్నది తెలుస్తుంది. అయితే టిడిపితో పొత్తులు పెట్టుకోవటం అన్నది స్ధానిక నేతలు తీసుకుంటున్న నిర్ణయంతో జరిగిపోతోంది. ఇక్కడే పవన్ పై బిజెపి నేతలు మండిపోతున్నారు. పైగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి పవన్ అందుబాటులో ఉండటం లేదు. అన్నీ వ్యవహారాలు నాదెండ్ల మనోహర్ ద్వారానే జరుగుతున్నాయి. నాదెండ్లకేమో పార్టీ నేతలపై పట్టులేదు. దాంతో ఏ జిల్లాలో ఎవరితో పొత్తులు పెట్టుకుంటున్నారో కూడా క్లారిటి లేదు. ఈ కారణంగానే బిజెపి పవన్ పై మండిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: