తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. హైదరాబాద్ లో 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా వారి ఆరోగ్యం నిలకడగానే ఉండటం గమనార్హం. తాజాగా మంత్రి కేసీఆర్ 11 మంది కరోనా నుండి కోలుకున్నట్లు ప్రకటన చేశారు. 
 
ఈ వార్త నిజంగా తెలంగాణ ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. రాష్ట్రంలో నిన్న కరోనా వ్యాధితో తొలి మరణం నమోదైనప్పటికీ... సకాలంలో గుర్తించలేకపోవడం వల్లే ఆ వ్యక్తి చనిపోయినట్లు తేలింది. ఖైరతాబాద్ కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తరువాత ఆ వ్యక్తిలో కరోనా ఉన్నట్లు తేలింది. ఇప్పటివరకూ ఆస్పత్రిలో చేరిన 66 మందిలో 65 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నిన్న మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. 
 
ఒకరి పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉందని ఆ వ్యక్తి కూడా కోలుకుంటాడని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు. కేటీఆర్ ప్రకటించిన 11 మందికి గతంలో పాజిటివ్ అని తేలగా తాజా రిపోర్టుల్లో నెగిటివ్ అని తేలింది. కేటీఆర్ ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. త్వరలోనే వీరిని డిశ్చార్జ్ చెయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్నారు. 
 
కరోనాపై పోరాడేందుకు కేసీఆర్ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కఠినంగా నిబంధనలను అమలు చేస్తూ తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యేందుకు కృషి చేస్తున్నారు. కేంద్రం తాజాగా కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా 47 ల్యాబ్ లకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో ఇప్పటివరకూ 35,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: