ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఆ వైరస్ భారిన పడి చనిపోయిన వారి సంఖ్య 70 వేలకు చేరువవుతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఓ వైపు ప్రయత్నిస్తూ.. మరోవైపు మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రపంచదేశాలన్నీ కుస్తీ పడుతున్నాయి. మున్ముందు ఇది ఎంత మందిని పొట్టన పెట్టుకుంటుందోననే భయం అన్ని దేశాలనూ వెంటాడుతోంది.

 

కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలం అవుతున్నాయి. 2 వందలకు పైగా దేశాలు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు యురోపియన్ దేశాలతో పాటు అమెరికాను వణికిస్తోంది. కరోనా భారిన పడిన వారి సంఖ్య 13 లక్షలకు చేరువలో ఉంది. మరణాలు 70వేలకు దగ్గరలో ఉన్నాయి. ఇదే ఇప్పుడు అత్యంత భయాందోళన కలిగిస్తున్న అంశం..

 

ఇటలీలో సుమారు లక్ష 30 వేల మందికి కరోనా సోకగా మరణాల సంఖ్య ప్రపంచంలోనే ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ సుమారు 16 వేల మంది ఆ దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సుమారు 525 మంది చనిపోయారు. అయితే గతంలో పోల్చితే మరణాల సంఖ్య తగ్గుతుండడం ఆ దేశానికి ఊరటనిస్తున్న అంశం. దీంతో కొన్నాళ్లుగా లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఇటలీ సిద్ధమవుతోంది. ఆంక్షల నుంచి సడలించేందుకు రెడీ అవుతోంది.

 

ఇటలీ తర్వాత ఎక్కువ మంది చనిపోయింది స్పెయిన్‌లోనే.! స్పెయిన్‌లో ఇప్పడి వరకూ లక్ష 30 వేల మందికి పైగా కరోనా సోకింది. సుమారు 13 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 674 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడ కూడా వరుసగా మూడు రోజుల నుంచి మరణాల సంఖ్య తగ్గుతోంది. కానీ బాధితుల సంఖ్య మాత్రం ఇంకా తగ్గలేదు.

 

ఇక కరోనా మరణాల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఆ దేశంలో 9వేల 6వందల మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల 36వేల మందికి పైగా ఆ వ్యాధితో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యాధిగ్రస్తుల జాబితాలో అమెరికాదే ఫస్ట్ ప్లేస్.! ఎక్కువ మందికి పరీక్షలు చేస్తుండడం వల్లే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ దేశం చెప్పుకొస్తోంది. అయితే న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషానికి ఒకరు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

 

కరోనా మరణాల్లో ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ ఆ దేశంలో 8 వేల మందికి పైగా చనిపోయారు. 92 వేల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆదివారం 357 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల్లో ఇదే అత్యల్పం కావడంతో ఫ్రాన్స్‌కు ఊరటనిస్తోంది. అయితే రోజురోజుకూ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది.

 

ఇక బ్రిటన్‌లో సుమారు 5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 48వేల మంది కరోనా వైరస్‌ సోకి ఆసుపత్రుల పాలయ్యారు. అయితే కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండడంతో బ్రిటన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది.

 

వ్యాధి మొదలైన చైనాలో 3వేల 3వందల మందికి పైగా కరోనా భారినపడి చనిపోయారు. సుమారు 82 వేల మంది బాధితులు ఉన్నారు. ఆదివారం కూడా 39 కొత్తకేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపింది ప్రభుత్వం. అయితే గతంతో పోల్చితే మరణాల సంఖ్య, వ్యాధి భారిన పడుతున్నవారి సంఖ్య చైనాలో గణనీయంగా తగ్గింది.

 

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో సక్సెస్‌ సాధించిన దేశంగా పేరు తెచ్చుకున్న సింగపూర్‌లో ఆదివారం ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. ఒక్కరోజే 120 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 13వందలకు పైగా కేసులు సింగపూర్‌లో నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్నాయి. అయినా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో మరిన్ని ఆంక్షల దిశగా పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించడం తప్ప మరో మార్గం లేకపోవడంతో దాన్ని మరింత కఠినంగా పాటించేందుకు సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: