టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా చంద్రబాబు హైదరాబాద్‌ నుంచే ప్రెస్ మీట్లు పెడుతూ ఏపీ సర్కారు కరోనాను బాగా డీల్ చేయడం లేదని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాను మొదటి నుంచి అనేక సూచనలు చేస్తున్నా.. తనను పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇది రాజకీయాలు మాట్లాడడానికి సమయం కాదని తెలిసినా ప్రతిపక్ష నేత బురదచల్లుడు రాజకీయాలతో బిజీగా ఉన్నాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్త ప్రభుత్వ యంత్రాంగం కంటిపై కునుకులేకుండా కరోనా మహావిపత్తుపై పోరాడుతుంటే.. తెలంగాణలో కూర్చున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కరోనా లెక్కలతో కుస్తీలు పడుతున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బురదజల్లుడు రాజకీయాలకు ఇది వేళ కాదన్న కనీస స్పృహ లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వాసుపత్రులను గాలి కొదిలేసి, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

 

 

ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కాడని... ఆరోగ్య శ్రీ కార్డులు ఇతర రాష్ట్రాల్లో చెల్లకుండా చేసి రోగుల ఉసురు తీశారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కమిషన్ల కోసం ప్రజారోగ్య వ్యవస్థను బలి చేశారని విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. విజయసాయిరెడ్డి ఒక్కరే కాదు.. మిగిలిన నేతలు చంద్రబాబు తీరును ఎండగట్టారు.

 

 

వారిలో ముఖ్యంగా మంత్రి పేర్ని నాని తనదైన స్టయిల్లో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా బాధితుల కోసం 24 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. రోజుకు 1,175 శాంపిల్స్‌ పరీక్షలు జరుపుతున్నట్టు వెల్లడించారు. అయినా చంద్రబాబు పరీక్షలు జరగడం లేదని, అన్ని చెప్పడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: