హైదరాబాద్‌ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ పెద్దగా కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లోకూ చొచ్చుకుపోతోంది. హైదరాబాద్ నగరంలో దాదాపు నెలన్నర క్రితం నుంచి కరోనా కేసుల జాడ ఉన్నా.. ఏనాడు వనస్థలిపురం ప్రాంతంలో కరోనా కేసులు కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా వచ్చేసింది. అందులోనూ ఒక వ్యక్తి మరణించడం మరింతగా కలకలం రేపుతోంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. గడ్డిఅన్నారం డివిజన్‌ శారదానగర్‌కు చెందిన వ్యక్తి మలక్‌పేట గంజిలో నూనె వ్యాపారం చేస్తున్నాడు. అతనికి కొన్ని రోజుల క్రితం జ్వరం వచ్చింది. వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో నివాసం ఉండే సోదరుడు ఇంటికి వచ్చి అతడి సహాయంతో స్థానికంగా ఉన్న జీవన్‌సాయి ఆసుపత్రిలో చేరాడు. ఈ నెల 22 నుంచి 25 వరకు చికిత్స పొందాడు. తర్వాత అతనికి కరోనా అన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.

 

 

అప్పటి నుంచి అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని సోదరుడి కుటుంబ సభ్యులను ఇంటిలోనే క్వారంటైన్‌ చేశారు. అయితే అతడి సోదరుడి తండ్రికీ కరోనా వచ్చింది. ఇప్పటికే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడు కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నూనె వ్యాపారి నుంచి అతడి భార్యకు, సోదరుడికి, సోదరుడి భార్య, ఇద్దరు కూతుళ్లకూ వైరస్‌ సోకింది.

 

 

దీంతో ఇప్పటివరకూ కరోనా జాడ లేని వనస్థలిపురంలో ఇప్పుడు కరోనా భయాందోళనలు నెలకొన్నాయి. ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు సదరు కాలనీని సందర్శించారు. రెడ్‌ జోన్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికి అధికారులకు తెలపకుండా వైద్యం చేసిన జీవన్ సాయి ఆసుపత్రిపైనా స్థానికులు మండిపడుతున్నారు. కిరాణా, పాల వ్యాపారం నిర్వహిస్తున్న కరోనా బాధితుడి సోదరుడి నుంచి బయటి వారికి ఎవరికైనా కరోనా సోకిందా అనే దానిపై వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆరా తీస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: