బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

 

రాయలసీమ కోస్తాంధ్ర మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, దాంతో గడిచిన 24 గంటలో అన్ని ప్రాంతాలు సాధారణ వర్షపాతం నమోదైందని అమరావతి వాతావరణ విభాగం  తెలిపింది. రాబోయే 24  గంటలో రాయలసీమ కోస్తా ఆంధ్రలో ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో  భారీవర్షాలు పడే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది రుతుపవనాలు త్వరగానే వచ్చాయని, ప్రస్థుతం అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. మరో రెండు రోజుల పాటు సాధారణ వర్షపాతం కొనసాగుతుందని చెప్పింది.  అల్పపీడనం ప్రభావం వల్ల కోస్తాఆంధ్ర తీరం నుండి బలమైన 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్శవద్దని సూచించింది. 

 

రుతుపవనాల ప్రభావంతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం వద్ద రాత్రి కురిసిన వర్షానికి రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. గుంటూరు-గుంతకల్లు మధ్య నడిచే సరకు రవాణా రైళ్లకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

 

గుంటూరు జిల్లాలో కురిసిన 49.75 మిల్లీ మీట‌ర్ల వ‌ర్షం కార‌ణంగా.. గుంటూరు-గుంతకల్లు రైల్వే లైనులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీవర్షాల తాకిడికి రైల్వే లైన్లు కోతకు గురయ్యాయి.రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. అల్పపీడనం వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపర్లు చెట్లు, చెరువు నీటి కుంటల దగ్గర ఉండకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: