కరోనా వైరస్ పేరు వినిపిస్తే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొందరిలో కరోనా లక్షణాలు కనిపిస్తోంటే మరికొందరికి కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. పరీక్షలు చేస్తే మాత్రమే లక్షణాలు కనిపించని వారికి వైరస్ నిర్ధారణ అవుతోంది. 
 
పలు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు కనిపించని వారు ఇంటి నుంచే చికిత్స చేయించుకోవాలని, హోం క్వారంటైన్ కు పరిమితం కావాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. లక్షణాలు లేని వారితో కరోనా సోకే అవకాశం తక్కువ అని నిపుణులు సైతం చెబుతున్నారు. కానీ లక్షణాలు లేని వారి నుంచి కూడా వైరస్ సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. 
 
సిచుయాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరీక్షలో కరోనా సోకిన వారిలో లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా వైరస్ ఇతరులకు సోకే అవకాశాలు ఉన్నాయని తేలింది. లక్షణాలు కనిపించటం లేదని ఎవరైనా వారితో సన్నిహితంగా మెలిగినా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా బాధితులు తాకిన వస్తువుల నుంచి వైరస్ భారీన పడే అవకాశం ఉందని... అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
కరోనా లక్షణాలు లేని వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుండటం వల్లే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 920 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 11,364కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 70,934 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.                   
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: