అగ్రరాజ్యం పేరు చెబితేనే కొన్ని దేశాలు వణికిపోతాయి. అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతునిగా భావిస్తారు. మరి అలాంటి వ్యక్తికి ఇరాన్‌ అరెస్టు వారెంట్  జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఇంతకీ  ఖాసిం సులేమాని హత్యపై ఇరాన్ ఎందుకంతగా రగిలిపోతోంది...? అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఇతర దేశాల ఆర్థిక ఆంక్షల హెచ్చరికలు బేఖాతరు చేయకుండా అమెరికాతో కయ్యానికి ఎందుకు కాలు దువ్వుతోంది..? అసలీ ఖాసిం సులెమానీ ఎవరు?

 

ఖాసిం సులేమాని...ఇరాన్ సైనిక కమాండర్, నాలుగు దేశాల్లో కీలకమైన ఖుద్స్ దళం అధ్యక్షుడు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో సులేమాని అక్కడకు వస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడిచేసి అమెరికా ఆయన్ను హతమార్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడు సులేమాని. ఆ దేశంలో ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్‌కోర్‌లో కీలక విభాగమైన ఖుద్స్ ఫోర్స్ ద్వారా అనేక దేశాల్లో సైనిక కార్యకలాపాలను నియంత్రించారు ఖాసిం. రసాయనిక దాడులను సాకుగా చూపిస్తూ అమెరికా...ఇరాక్‌లానే సిరియా ఆక్రమణకు సిద్ధపడితే...అడ్డుకుని ఆ దేశాన్ని.. అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను రక్షించింది ఖాసిమే. సిరియాతో పాటు యెమెన్, లెబనాన్, ఈజిప్టుల్లో ఖాసిం మాట శిలాశాసనం లాంటిదే. అయితే తనకు లభించిన అపరిమిత అధికారాలను ఆయన ఎన్నడూ దుర్వినియోగం చేయలేదు. రాజకీయాల  జోలికి వెళ్లకుండా అత్యుత్తమ దేశభక్తుడిలా...ఇరాన్‌కు సేవ చేశారు ఖాసిం. అమెరికా దాష్టీకాన్ని ఇరాన్‌తో పాటు మిత్రదేశాలు తట్టుకుని నిలబడడంలో విశేష కృషి చేశారు. అమెరికాకే కాదు...ఐసిస్‌ కిరాతకాలకూ చెక్‌ పెట్టారు ఖాసిం. అమెరికా ఆక్రమణతో రావణ కాష్టంలా మారిన ఇరాక్‌లోని పరిస్థితులును అలుసుగా తీసుకుని హేయమైన చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్‌ ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖాసిం ఆధ్వర్యంలోని సైనిక బలగాలు తిప్పికొట్టాయి. ఇలా స్వదేశం ఇరాన్‌లోనూ, ఇరాక్ వంటి ఇతర దేశాల్లోనూ అనేకమందికి ఆరాధనీయుడయ్యారు ఖాసిం. 

 

పశ్చిమాసియా ముస్లిం దేశాలు హీరోగా భావించే ఖాసిం సులేమానిని అమెరికా మాత్రం ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయన్ను హతమార్చేందుకు ఏళ్లగా అదను కోసం ఎదురుచూసింది. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో జరిగిన ఘటనలు అమెరికాకు సాకుగా దొరికాయి. ఇరాక్‌లోని తిక్రిత్‌లో అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి జరిగింది. దీనికి ప్రతిగా కతైబ్ మిలీషియా స్థావరంపై దాడి జరిపి 24 మందిని హతమార్చింది అమెరికా. దీనికి ప్రతీకారంగా అమెరికా దౌత్యకార్యాలయాన్ని చుట్టుముట్టిన కతైబ్ మిలీషియా 24గంటలు దిగ్బంధించింది. ఔట్ పోస్టుపై దాడిచేసింది. దీంతో అమెరికా నేరుగా రంగంలోకి దిగింది. ఈ దాడులు, ప్రతిదాడులను సాకుగా చూపుతూ జనవరి 3న బాగ్దాద్‌ విమానాశ్రయం దగ్గర డ్రోన్లతో దాడి చేసి ఖాసింను చంపేసింది. అమెరికా చర్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేక దేశాలు ఖాసిం హత్యను ఖండిస్తే...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన ఆదేశాలతోనే అమెరికా బలగాలు ఖాసింను హతమార్చాయని, ఆయన ఉగ్రవాదని చెప్పుకొచ్చారు. 

 

ఖాసిం సులేమాని హత్య ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇరాన్ రగిలిపోయింది.  ఇరాక్‌ సహా అనేక పశ్చిమాసియా దేశాల్లో అమెరికాకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరిగాయి. డెత్‌ టు అమెరికా అని నినదించిన ఆందోళన కారులతో ఇరాన్ వీధులన్నీ నిండిపోయాయి. ఖాసిం అంత్యక్రియలు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకం అమెరికాకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఖాసిం సులేమాని హత్య జరిగిన వారం రోజుల లోపే... ఉక్రెయిన్ ప్రయాణికుల విమానాన్ని ... అమెరికాదిగా పొరపడి ఇరాన్ క్షిపణితో కూల్చివేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. ఇరాన్‌పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి.  ఇదంతా జనవరిలో పరిస్థితి. 

 

అయితే జనవరి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించడంతో ఈ అంశం పక్కకు వెళ్లిపోయింది. అన్ని దేశాలూ కరోనా భయంలో మునిగిపోయాయి. అమెరికా, ఇరాన్ సైతం కరోనా తీవ్రతకు అతలాకుతలమయ్యాయి. దీంతో ఖాసిం హత్య సంగతి అందరూ మర్చిపోయారు. కానీ ఇరాన్ మాత్రం మర్చిపోలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత కూడా ఇరాన్ ఇంకా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూనే ఉంది. డెత్ టు అమెరికా అని నినదించిన ఇరాన్ తాజాగా...అమెరికా అధ్యక్షుడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ట్రంప్‌తో పాటు మరో 30 మంది పాత్ర ఉందని, టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ ఆరోపించారు. ఇంటర్ పోల్ సాయంతో...ట్రంప్‌ను అరెస్టు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పుడు అధికారం అండతో తప్పించుకున్నా..పదవీ కాలం ముగిసిన తర్వాతయినా ట్రంప్‌ను అరెస్టు చేసి ఖాసిం హత్యకు సరైన గుణపాఠం నేర్పాలన్నది ఇరాన్ ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: