ఇక నేటి అయోధ్య ఉత్తర ప్రదేశ్ లో... సరయూ నది ఒడ్డున ఉన్న పట్టణం. జనాభా 60 వేలు. జిల్లా కేంద్రం ఫైజాబాద్ కు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే... ఇవి రెండు జంట పట్టణాలు. హనుమంతుడి నివాసంగా చెప్పుకొనే హనుమాన్ గఢీ, సీతాదేవికి కానుకగా ఇచ్చినట్టు భావించే కనక్ భవన్, దశరథుడి అంతఃపురం రాజా దశరథ్ మహల్లు అయోధ్యలోని దర్శనీయ స్థలాలు. అన్నింటికంటే ముఖ్యమైనది... రామజన్మభూమి. తాత్కాలిక నిర్మాణంలో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని భక్తులు దాదాపు 30 అడుగుల దూరం నుంచే దర్శించుకుంటున్నారు.
మే రెండో వారంలోనే భూమిని చదును చేసి, శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ క్రమంలో జరిగిన తవ్వకాల్లో ఐదడుగుల శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కివున్న స్తంభాలు, ఎర్రరాతి ఇసుక ధ్వజాలు, కలశం, రాతి పుష్పాల లాంటివి బయటపడ్డాయి. ఇవన్నీ పురాతన ఆలయానికి సంబంధించినవే. తవ్వకాల్లో బయటపడినవాటినన్నిటినీ భద్రం చేసి భవిష్యత్తులో ఏర్పాటుచేయబోయే మ్యూజియంలో ఉంచబోతున్నారు.
అయోధ్యలో రామయ్యకు కట్టబోయే గుడి కొత్తగా రూపకల్పన చేసింది కాదు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 1989లో ఈ ఆలయ డిజైన్ని రూపొందించారు. కరసేవకపురంలో 150 మంది శిల్పులు, వందలాది కార్మికులతో పనులు కూడా ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు పనిచేశాక స్థలవివాదం ఎటూ తేలకపోవడంతో వారంతా ఎవరి ఊళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఆనాటి ఆలయ డిజైన్ లో కొన్ని మార్పులతో ఇప్పుడు ఆలయ నిర్మాణం జరుగుతోంది.
రామయ్యకు సంబంధించిన 67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఆలయంలో గుడి శిఖరం నేల మీది నుంచి 128 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం దేవాలయమంతా ఒక విశాలమైన, ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది. దాని మీదికి వెళ్లడానికి మెట్లుంటాయి. దక్షిణాది గుడులలో లాగా పెద్ద పెద్ద ప్రహరీ గోడలు ద్వారాలూ ఉండవు. కుషాణుల పాలన చివరలో, గుప్తుల పాలన మొదట్లో ఇలాంటి దేవాలయాలను కట్టినట్లు చరిత్ర చెబుతోంది. అధికారికంగా నిర్మాణం ఇప్పుడే మొదలెట్టినా నిజానికి సగం పని అయిపోయింది. ఒకసారి పని మొదలైతే ఇక్కడ సిద్ధంగా ఉన్న శిల్పాలను, ఇటుకలను డిజైన్ కి అనుగుణంగా వాటి వాటి స్థానాల్లో ఉంచటమే మిగిలి ఉంది.
మందిర నిర్మాణంతో ఒకప్పుడు దేశంలోని ఏడు ప్రధాన తీర్థయాత్రాస్థలాల్లో ఒకటిగా పేరొందిన అయోధ్యకి తిరిగి ఆ వైభవం రాబోతోంది. ఫైజాబాద్ జిల్లాలో ఓ భాగంగా ఉన్న అయోధ్యను ఇప్పటికే ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్లో అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణానికి భారీగానే నిధులు కేటాయించారు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు సరయూ నది ఒడ్డున 151 మీటర్ల ఎత్తైన భారీ రామ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కూడా యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా కోదండరామయ్య కొలువు దీరే అయోధ్యరూపు రేఖలు కూడా మారిపోతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి