శనివారం నుంచి దుర్గానవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రులకు బెజవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. కరోనా నిబంధనలతో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. మరోవైపు.. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటిచెప్పే, బతుకమ్మ పండుగలో భాగంగా.. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుక ప్రారంభమైంది.

బెజవాడ ఇంద్రకీలాద్రిలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు...కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న కారణంతో.. కొండపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మదర్శనానికి వచ్చే భక్తులు.. కరోనా నిబంధనలు పాటిస్తూ, దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే కొండపైకి అనుమతించనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు... రంగనాయకుల మండపంలో దర్శనమిచ్చారు. ఈవో జవహర్‌ రెడ్డి కంకణధారణ చేశారు. తర్వాత ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో ఉత్సవాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు  ప్రారంభమయ్యాయి. మహిళలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. ఈ సారి వర్షాలు, కరోనా వైరస్ .. బతుకమ్మ పండుగ నిర్వహణపైనా ప్రభావం చూపింది. ఇళ్ల వద్దనే మహిళలు పండుగ జరుపుకుంటున్నారు.
బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులంతా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ శోభ కనిపిస్తోంది. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఆరంభం కాగా.. రేపటి నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలతో భక్తులను అనుమతించనున్నారు. బతుకమ్మ సంబరాలు కూడా సామాజిక దూరంతో కొనసాగుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: