ఏపీలో ఇసుక అమ్మకాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈమేరకు నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్.. మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన ఇసుక విధానం రూపొందించాలని సూచించారు. నూతన ఇసుక విధానంపై క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందం, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.
సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి..
- ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి.. ప్రజల సూచనలు, సలహాలు పొందాలి.
- ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు.
- పూర్తి పారదర్శకంగా నూతన విధానం ఉండాలి.
- ఇసుక ధర కూడా రీజనబుల్‌గా ఉండాలి. సరఫరాలో సమర్థతను పెంచాలి.
- నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలి.
- ఎవరికి వారు రీచ్‌కు వచ్చి నిబంధనల మేరకు ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి.
- కాంట్రాక్టర్‌ స్టాండ్‌ బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ఆయా నియోజకవర్గాల్లో నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదు.
- ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల వారి ఇళ్లకు టోకెన్లు ఇచ్చి, సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలి.
ఇసుక రీచ్‌లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని, వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుందని, రవాణా వ్యయం ఎక్కువగా ఉందని, దాన్ని రీజనబుల్ గా ఉండేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.

మొత్తమ్మీద.. నూతన ఇసుక విధానంలో మార్పులు చేర్పులు రాబోతున్న విషయం స్పష్టమైంది. ఇసుక రీచ్ లను గతంలో డ్వాక్రా సంఘాలకు అప్పగించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అయితే ఆ విధానం విఫలమైంది. తాజాగా సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా ఇసుకను అమ్మే విధానం తీసుకొచ్చారు. ఇది కూడా వినియోగదారులకు కష్టంగా మారింది. దీంతో కొత్త ఇసుక పాలసీకోసం జగన్ సర్కారు కసరత్తులు చేస్తోంది. అంతిమంగా ప్రజలు లాభపడేందుకు నూతన పాలసీ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: