వరుస ఓటములతో అయోమయంగా మారిన వర్తమానం.. అంధకారంగా కనిపిస్తున్న భవిష్యత్తు. రేపు ఎలా ఉంటుంది అనే దాని కంటే.. అసలు రేపనేది ఉందా అనే ఆందోళన. నేతలంతా వేరే పార్టీల్లో చేరుతున్నారు. కేడర్‌కు దిశానిర్దేశం చేసే దిక్కు లేదు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పరిస్థితి.. ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఉంది.

మీకసలు సిగ్గు, శరం ఉందా.. ఈ ఒక్క మాటే అనలేదు కానీ.. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపై సహచర పార్టీల నేతలు అనని మాట లేదు. కూటమిలో మిగతా పార్టీలన్నీ ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే.. ఒడ్డున నిలబడి దిక్కులు చూస్తారా?. పార్టీకి ప్రచారం చేయడం అంటే పిక్నిక్‌కు రావడం అనుకున్నారా అంటూ... కాంగ్రెస్ నాయకత్వాన్ని కడిగి పారేశారు ఆర్జేడీ నేత శివానంద్ తివారి. కాంగ్రెస్ వల్లనే మహా కూటమి ఓడిపోయిందని.. 70 స్థానాల్లో పోటీ చేసి.. 19 స్థానాలే గెలిచిందని.. ఇంత కంటే దౌర్బాగ్యం ఏముంటుందని ప్రశ్నించారు.

బీహార్‌లోని మహా కూటమి పార్టీల ఆగ్రహంలో వాస్తవం ఉంది. అధికారాన్ని అడుగు దూరంలో కోల్పోయిన ఆవేదన ఉంది. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాలేకపోవడానికి వంద కారణాలు రాయమని ఎవరినైనా అడిగితే.. వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీయే అని చెబుతారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచిన పార్టీ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటే.. ఓడిపోయిన పార్టీ ఎందుకు ఓడిపోయాం ఎక్కడ పొరపాటు జరిగిందని సమీక్షించుకోవడం సహజం. బీహార్‌లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్‌లో ఎలాంటి సమీక్ష జరగలేదు. కూటమిలోని మిగతా పార్టీలు తెగించి పోరాడితే తాము చేతులెత్తేశామనే వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితిలో లేదు హస్తం నాయకత్వం.

బీహార్‌లోనే కాదు.. దేశంలో మిగతా ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రియాంక ఇన్‌ఛార్జ్‌గా ఉన్న యూపీలో 7 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే అన్నిటిలో ఓడిపోవడమే కాక నాలుగు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్  కోల్పోయారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న  గుజరాత్ లో 8 సీట్లకు  ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లలోనూ ఆ పార్టీ  పరాజయం పాలైంది.  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన 25 మందిలో 15 మంది బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. కంచుకోటల్లాంటి సెగ్మెంట్లలోనూ హస్తం అభ్యర్థులు ఓడిపోయారు. కర్ణాటకలో బిజెపి ఏనాడూ గెలవని సీరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ  విజయం సాధించింది. తెలంగాణలో ని దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: