పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గత నెలలో ఏలూరులో వందలాది మందిని హాస్పటిల్ పాల్డేసిన వింత వ్యాధి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.  భీమడోలు మండలం పూళ్ల, దెందులూరు మండలం కొమరెపల్లిలో ఒకేరోజు 21 మంది అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. వింత వ్యాధి వెనుక కుట్రకోణం దాగి ఉందన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని కామెంట్ చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీలపైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు. వింత వ్యాధి వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందని ఆళ్లనాని వ్యాఖ్యానించారు.

వింత వ్యాధిపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయిన   ఆళ్ల నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వింత వ్యాధి ప్రభలటానికి విపక్షాలు కారణమని మంత్రి చెప్పడంపై పలువురిని విస్మయపరుస్తోంది. ఈ రకమైన ప్రకటనలతో తమ  వైఫల్యాన్ని ప్రభుత్వమే అంగీకరిస్తుందనే వాదనలు వస్తున్నాయి. అళ్ల నాని ఆరోపణలపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. పాలన చేత కాక ప్రజలను గాలికొదిలేసి తమపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకా.. గ్రామాలన్ని మురికి కూపాలుగా మారిపోయాయని, ఆరోగ్య శాఖ పడకేసిందని వారు ఆరోపిస్తున్నారు.

     మరోవైపు వింత వ్యాధిపై కుట్రకోణం దాగి ఉందన్న ఆరోపణళపై జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ స్పందించారు. బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపామని.. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కుట్రకోణం వెనుక ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అలాంటిదేమైనా ఉంటే ఎవర్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ్ నాయక్ స్పష్టం చేశారు. కుట్ర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని ఎస్పీ ప్రకటించగా.. ఉప ముఖ్యమంత్రిగా ఉండి అళ్లనాని ఎలా తమపై ఆరోపణలు చేస్తున్నారని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: