ఇది నిజంగా ఇటు ఇండియాకు.. అటు చైనాకూ గుడ్ న్యూస్.. ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకూ రెండు  దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది.. కానీ.. కొన్ని రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలిస్తున్నాయి. ఇండియా చైనా మధ్య ఏడాదిన్నరగా ఘర్షణ వాతారవరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీ తలపడి ఇరువైపులా ప్రాణ నష్టం జరగడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఆ తర్వాత అనేక చర్చల తర్వాత ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. పాంగ్‌యాంగ్‌ లోయలో ఫింగర్ 8 ప్రాంతానికి వెళ్లేందుకు చైనా.. ఫింగర్ 1,2 ప్రాంతాలకు  వచ్చేందుకు ఇండియా అంగీకరించాయి.  

ఇప్పుడు ఈ చర్చలు మరో దశకు చేరుకున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో.. విదేశీ వ్యవహారాల మంత్రి జయ్‌శంకర్‌ 75 నిమిషాల పాటు ఫోన్‌ ద్వారా సంభాషించారు. ఈ సంభాషణ వివరాలను  విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ  వెల్లడించింది. తూర్పు లద్ధాఖ్‌ సహా ద్వైపాక్షిక సంబంధాలపై   చర్చించినట్లు తెలిపింది. గత ఏడాది కాలంగా ఇరు  దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు చైనాకు జై శంకర్‌ తెలిపారని పేర్కొంది. దౌత్య, సైనిక పద్ధతుల ద్వారా సంబంధాలు కొనసాగించాలని జై శంకర్‌ కోరారు.

అంతే కాదు.. సైనిక దళాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరగాలని చైనాకు భారత్‌ తెలిపింది. అలా చేస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడంతో పాటు సరిహద్దుల్లో శాంతి నెలకొల్పవచ్చని  భారత్ చెబుతోంది.  పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణపై అటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ సంతృప్తి వ్యక్తం చేశారు.


ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారకుండా ఉండాలంటే సరిహద్దు సమస్యను సరిగ్గా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చైనా అంటోంది. మొత్తానికి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు బాగా తగ్గినట్టే కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచివి కావన్న విషయం రెండు దేశాలకూ అర్థమైందనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: