నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు వేడెక్కాయి. త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.  దీంతో ప్రధాన పార్టీలన్నీ సాగర్ పైనే దృష్టి పెట్టాయి. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు అన్ని పార్టీల్లో జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాత్రం జానారెడ్డి ఫైన‌ల్ చేసేసింది ఆ పార్టీ అధిష్ఠానం. గ‌త కొద్దిరోజులుగా అభ్య‌ర్థి ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న టీఆర్ ఎస్ పార్టీ ఎట్ట‌కేల‌కు తుది నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం అందుతోంది. అనేక కోణాల్లో ఆలోచించి బీసీ క్యాండెంట్‌ను బ‌రిలోకి దించాల‌ని యోచిస్తోంద‌ని వినికిడి.


ఉపఎన్నిక టికెట్ కోసం ఆశావాహుల లిస్ట్ పెరిగిపోవడం.. రోజురోజూకీ మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారుకానుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే సామాజిక వర్గాల వారీగానే కాకుండా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పలు సర్వేలను అధికార టీఆర్ఎస్ పార్టీ చేయించాకే పార్టీ అభ్య‌ర్థి విష‌యంలో నిర్ణయానికి  వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అదులో భాగంగానే బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ అల్లుడు కట్టబోయిన గురవయ్యయాదవ్‌ను రంగంలోకి దించేందుకు అంతా సిద్ధం చేసింది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంద‌న్న చ‌ర్చ పార్టీ వ‌ర్గాల మ‌ధ్య జ‌రుగుతోంది.


ఇదిలా ఉండ‌గా  దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఊపుమీదున్న బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్రంలో దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ తన ప్రాబల్యం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని గుర్రంబోడు తండా భూముల వ్యవహారంలోనూ బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో ఒక్కసారిగా జిల్లాలో హీట్‌ను పెంచింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికకు పోటీ నిలిపేందుకు అభ్యర్థి విషయంలో కొంత నాన్చుడు ధోరణిని పాటిస్తోంది. నిజానికి అది బీజేపీ వ్యుహామా.. లేక బలమైన అభ్యర్థి దొరక్కా అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: