దేశవ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఓ వైపు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లేక ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ... ఎప్పటిలాగే కార్యకలాపాలు జరుపుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు విషమ పరిస్థితికి దారి తీయనుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్యనిపుణులు. అయితే ఇది కేవలం నోటి మాట కాదు... ఓ ప్రముఖ వైద్య నిపుణుడు పరిశీలన తర్వాత ఇచ్చిన నివేదిక. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) కు చెందిన డాక్టర్ గిరిధర్ బాబు అనే వైద్య నిపుణుడు ఈ లెక్కలు తేల్చి చెప్పాడు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని లెక్కించిన ఈయన వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అత్యధిక ప్రమాదం పొంచి ఉన్న మధ్య ప్రదేశ్, బీహార్,  ఉత్తర ప్రదేశ్, ఛత్తీష్ గడ్ , పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో వెంటనే స్పందించి కరోనా నివారణ చర్యలు వాయువేగంతో చేపట్టాలని లేదంటే కరోనా బీభత్సం సృష్టిస్తుందని... రోజుకు తక్కువలో తక్కువ లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్ గిరిధర్ బాబు చెప్పినట్లు ఓ వార్త వెలువడింది. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి నుండి సగటున ముగ్గురికి సోకుతుందని... దీని ప్రకారం చూస్తే రోజు రోజుకు కేసులు రెట్టింపయి ఊహించని స్థాయిలో చేరుకుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం మన దగ్గర రెండు రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రష్యా వ్యాక్సిన్ అయిన "స్పుత్నిక్ వి" వ్యాక్సిన్ ను కూడా భారతదేశంలో వేసేందుకు అనుమతి ఇచ్చింది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి... కఠిన నిబంధనలతో కూడిన లాక్ డౌన్ అమలు చేస్తే తప్ప కరోనా కట్టడి అదుపులోకి రాదని.. ఈ వార్తను బట్టి తెలుస్తోంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరో వైపు ప్రధాని సూచనల మేరకు ఈ సారి లాక్ డౌన్ పెట్టేంత అవకాశాన్ని తెచ్చుకోకూడదని చెబుతున్నారు. ఈ దశలో ముఖ్యంగా యువత ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: