తెలంగాణలో లాక్ డౌన్ అనే ప్రకటన వెలువడిన వెంటనే వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. తెల్లవారితే మందు దొరకదేమోనన్న తొందరలో మందుబాబులంతా ముందు రోజే షాపులముందు క్యూ కట్టారు. తెలంగాణలో దాదాపుగా ప్రతి వైన్ షాపు ముందూ ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో అయితే వైన్ షాపుల ముందు జాతరే కనిపించింది. నో స్టాక్ బోర్డ్ లు కనపడే వరకు మందుబాబులు షాపుల ముందునుంచి కదల్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జూబ్లీ హిల్స్ లోని ఓ లిక్కర్ షాపులో కేవలం 3 గంటల్లో మూడున్నర కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడైనట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టడం విశేషం.

కరోనా కష్టాల్లోనూ మందుకి ఇంత డిమాండ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రజలకు కావాల్సింది వ్యాక్సినా, మందా.. అనే విషయంపై ప్రభుత్వాలు కూడా ఓ అంచనాకు రావొచ్చు. ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారు, ప్రభుత్వమే అన్నీ భరించి టీకా వేస్తుంది అంటే.. మొదట్లో ఎవరూ ఇల్లు కదల్లేదు. మాకెందుకంటూ సైలెంట్ గా ఉన్నారు. తీరా ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత హడావిడిగా వ్యాక్సిన్ కేంద్రాల చుట్టూ గుమికూడారు. ఆ క్యూలైన్లు, తోపులాట చూసి వ్యాక్సిన్లకోసం ప్రజలు ఎలా గుంపులు గుంపులుగా వస్తున్నారో చూడండి అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే వైన్ షాపుల ముందు క్యూలైన్లు చూస్తే మాత్రం వ్యాక్సిన్ కేంద్రాల ముందు ఉన్న జనం ఏమూలకు సరిపోతారు అనిపిస్తుంది. వ్యాక్సినేషన్ కేంద్రాలకంటే వైన్ షాపుల ముందే జనం ఎక్కువగా కనిపించారు. అంటే వ్యాక్సిన్ తో ప్రాణాలు నిలుపుకోవడం కంటే.. మందు తాగి ఆరోగ్యాన్ని చిత్తు చేసుకోడానికే ఎక్కువమంది ఆసక్తి చూపించారనమాట.

అటు ప్రభుత్వాలు కూడా మందుబాబులకు ఏ లోటూ లేకుండా చూసుకోవడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. సాయంత్రం వరకు లాక్ డౌన్ నిర్ణయం ఎవరికీ తెలియదు, అయినా కూడా వైన్ షాపుల్లో రెట్టింపు స్టాక్ ఉందంటే.. వాళ్లు ఎంత ముందు చూపుతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రోజువారీ అమ్మకాలకంటే లాక్ డౌన ప్రకటన రోజు నాలుగు రెట్లు ఎక్కువగా మందు అమ్ముడుపోయింది. అయినా కూడా ఎక్కడా ఎవరూ అసంతృప్తికి లోను కాకుండా స్టాక్ తెప్పించి పెట్టుకున్నారు వైన్ షాపుల ఓనర్లు. మొత్తమ్మీద అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మందగించినా.. వైన్ అమ్మకాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే 6 గంటలకల్లా మందుబాబుల సౌకర్యార్థం లిక్కర్ షాపులు తెరచి ఉంచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: